AP Politics: ఒక రోజు అర్థరాత్రి దాటిన తర్వాత ఆ ఇంట్లో మొదలైన మరణ మృదంగం ఆరేళ్లయినా ఆగలేదు. 70 ఏళ్ల ఆ పెద్దాయనని తెల్లవారుజాము వరకూ చిత్ర వధ చేసి చంపారు. హంతకులు ఆరితేరిన ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఏమీ కాదు. స్పైపర్ గన్స్‌తో షూట్ చేసి క్షణాల్లో పరారవ్వలేదు. గంటల తరబడి అదే ఇంట్లో తిష్టవేసి.. గొడ్డలితో నరికి నరికి చంపారు. హత్య జరిగిన స్పాట్‌కి ఓ ఇద్దరు కానిస్టేబుళ్లను పంపిస్తే.. గంటలో క్లోజ్ అయ్యే కేసు. కానీ ఆరేళ్లయినా తెమలడం లేదు. టన్నులు టన్నులు టావులు ఖర్చు చేస్తూ చార్జి షీట్లు రాస్తున్నారు. లోకల్ పోలీసుల నుండి సీబీఐ వరకూ తలమునకలయ్యారు. అయినా కేసు అంగుళం కదలటం లేదు. ఈ లోపు సాక్షులు ఒకరి తర్వాత ఒకరు పరలోకానికి ప్రయాణమవుతున్నారు. సింపుల్‌గా తేలాల్సిన కేసు ఎందుకు, ఎలా ఇంత జఠిలంగా మారింది? వివేకా హత్య కేసు చరిత్రలో ఓ కేస్ స్టడీగా ఎలా మారబోతోంది? మొత్తం మీ కళ్ల ముందు పెట్టబోతున్నాం.
హత్య జరిగింది. కళ్లముందు శవం కనబడుతోంది. గంటల్లోపే ప్రపంచం మొత్తానికి వార్త చేరిపోయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, పోలీసు జాగిలాలతో వేట మొదలు పెడితే.. హంతకులు ఊరు దాటి పోయేలోపు పట్టుకునే కేస్ ఇది. అయినా ఎక్కడికక్కడ వక్రీకరణలకు గురైంది. దర్యాప్తు ఆటంకాలకు గురైంది. అన్నిటి కన్నా ముఖ్యంగా.. వ్యవస్థలు రాజకీయ ప్రమేయానికి తలొగ్గి కేసు ఆ రోజే నిర్వీర్యం అయిపోయింది. రాయలసీమ చరిత్రలో మనకు తెలిసి ఈ తరహా కేసులు రెండే రెండు. ఒకటి పరిటాల రవి హత్య కేసు కాగా… రెండోది వైఎస్ వివేకా హత్య కేసు.
రాయలసీమ. ఒకప్పుడు రాజకీయం, ఫ్యాక్షన్ రెండింటినీ విడదీలేని పరిస్థితులుండేవి సీమలో. నడి రోడ్లపై రక్తం ఏరులై పారేది. 1995లో చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యాక.. 2004లో సీఎంగా దిగిపోయే నాటికి… ఫ్యాక్షన్‌ని దాదాపుగా కంట్రోల్ చేశారు. ఆ తర్వాత ఏపీలో వైఎస్సార్ ఎరా మొదలైంది. వైఎస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే పరిటాల రవి హత్య జరిగింది. కొన ఊపిరితో ఉన్న ఫ్యాక్షన్‌కు ఆ నాటి వైఎస్ సర్కార్ ఆజ్యం పోసిందనీ, దాని వల్లే ప్రత్యర్థులకు పరిటాల రవిని మట్టుబెట్టడం సాధ్యమైందన్న ఆరోపణలున్నాయి. అప్పుడప్పుడే టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక నేరానికి పాల్పడితే… నేర పరిశోధన, పోలీసు దర్యాప్తులో… నిందులు సామాన్యంగా తప్పించుకోలేని పరిస్థితులు వచ్చేశాయి. అందులోనూ ఒక హై ప్రొఫైల్ రాజకీయ నాయకుడిని హత్య చేసి.. చట్టానికి దొరక్కుండా తప్పించుకోవాలంటే మామూలు విషయం కాదు.
వ్యవస్థల్ని మేనేజ్ చేయాలి. అందుకోసం ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారమూ తప్పనిసరి. హత్య తర్వాత సాక్షుల్ని, అవసరమైతే కొందరు నిందుతుల్ని కూడా ఎలిమినేట్ చేయాల్సి రావొచ్చు. అందుకు ముందే రంగం ప్రిపేర్ చేసుకుని ఉండాలి. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాతే పరిటాల రవి హత్యకు ఒడిగట్టారని భావించాల్సి వస్తోంది. పరిటాల రవి హత్య కేసు రిలేటెడ్‌గా చోటు చేసుకున్న హత్యలు, మిస్టీరియస్ మరణాలన్నీ అందువల్లే జరిగాయని అనుమానించాల్సి వస్తోంది. ఇప్పుడు పరిటాల రవి హత్య కేసు ఎందుకు ప్రస్తావనకు వస్తోందంటే.. ఈ కేసుతో పోలికలున్న, ఇంతకంటే క్రూరమైన హత్య కేసు ఒకటి రాష్ట్రాన్ని ఊపేస్తోంది. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఒక సినిమా కాదు.. సిరీస్ ఆఫ్ సినిమాలు చేసినా.. ఇన్ని ట్విస్టులు, ఇన్ని మలుపులు తెరక్కెక్కించడం సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అదే… ఆరేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు, అనుమానితులు వరుసగా మరణిస్తున్నారు. వైసీపీ పాలనా కాలం అంటే 2019-24 మధ్య నలుగురు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు. ఈ ఆరుగురివీ సహజ మరణాలేనని, అనారోగ్య కారణాలతో చనిపోయారని పైకి చెబుతున్నప్పటికీ లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి. అందరూ ఒకే తరహాలో చనిపోవటం అనేక సందేహాలకు తావిస్తోంది. అసలీ ఆరుగురి నేపథ్యం ఏంటి? ఎలా మరణించారు? చంపారా? చనిపోయారా? చనిపోయేలా చేశారా? బ్రీఫ్‌గా పరిశీలిస్తే… ముందుగా ఈ మిస్టీరియస్ మరణాలు మొదలైంది కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తితో! 2019 సెప్టెంబర్ 3న మృతి చెందిన 57 ఏళ్ల శ్రీనివాసుల రెడ్డి.. వివేకా హత్య కేసులో అనుమానితుడు.
వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషపుగుళికలు సేవించి, ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ విస్తృత ప్రచారం చేశారు. వివేకా హత్య కుట్రకు సంబంధించిన వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వరరెడ్డికి ముందే తెలుసన్న అనుమానాలున్నాయి. పరమేశ్వరరెడ్డి నార్కో ఎనాలసిస్ పరీక్షలకు హాజరై తిరిగొచ్చిన కొద్దిరోజుల్లోనే శ్రీనివాసులరెడ్డి మరణించారు. వివేకా హత్య కేసులో అనుమానితులను సిట్ ఇన్‌స్పెక్టర్ లోతుగా విచారిస్తున్నవేళ.. దాన్ని నిరోధించడానికే ఇలా చేశారన్న అనుమానాలున్నాయి. ఇది వైసీపీ హయాంలో వివేకా హత్య కేసులో నమోదైన తొలి అనుమానాస్పద మృతి. శ్రీనివాసులరెడ్డి మృతదేహంలో కాలేయం, కిడ్నీ మధ్య భాగంలో రక్తం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. పోలీసులు ఆ రక్తపు ఆనవాళ్లేమిటో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు.
రెండో అనుమానాస్పద మృతి జగన్ కారు డ్రైవర్ అయిన 52 ఏళ్ల నారాయణయాదవ్‌ది. 2019 డిసెంబరు 6న చనిపోయారు నారాయణయాదవ్. వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిలను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చింది నారాయణ యాదవే. అనారోగ్య కారణాలతో చనిపోయారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ విచారణ వేగవంతమవుతున్న తరుణంలో ఆయన మరణించటం సందేహాస్పదంగా మారింది. హైదరాబాద్- పులివెందుల ప్రయాణంలో జగన్‌మోహన్‌రెడ్డి, భారతి, అవినాష్‌రెడ్డి, ఇతరుల మధ్య వివేకా మరణానికి సంబంధించి ఫోన్ సంభాషణలు జరిగాయని, అవన్నీ నారాయణ యాదవ్ విన్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను కీలక సాక్షిగా విచారించాలి. విచారణకు పిలవకముందే ఆయన చనిపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. నారాయణ యాదవ్ మృతిపై పోలీసులు అసలు కేసే నమోదు చేయలేదు.
నంబర్ 3… ఈసీ గంగిరెడ్డి. ఈయన స్వయానా వైఎస్ భారతి రెడ్డి తండ్రి. 73 ఏళ్ల వయసులో 2020 అక్టోబరు 3న మరణించారు. వివేకా మృతదేహానికి కట్లు కట్టింది.. గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందే. వివేకా హత్య కుట్ర గురించి ఆయనకు తెలుసనే ఫిర్యాదులున్నాయి. వివేకా హత్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి, బ్యాండేజీలు చుట్టారు. వివేకా హత్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతీ అనుమానాస్పదంగానే ఉంది.
వివేకా కేసులో నాలుగో అనుమానాస్పద మృతి కల్లూరి గంగాధర్‌రెడ్డి. వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి 2022 జూన్ 9న మృతి చెందారు. 40 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ఆ మరణమూ అనేక సందేహాలకు తావిచ్చింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ బృందాలు పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకున్నాయి. అది జరిగిన వెంటనే.. ఈ కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు.
నేరాన్ని తనపై వేసుకుంటే 10 కోట్లు ఇస్తాం, లైఫ్ సెటిల్ చేస్తాం అంటూ దేవిరెడ్డి శివశంకరరెడ్డి తనకు ఆఫర్ ఇచ్చారంటూ 2021 అక్టోబరు 2న గంగాధర్‌రెడ్డి.. సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత అనుమానాస్పదంగా మాట మార్చారు. శివశంకరరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ సీబీఐ తనను బలవంతం చేసిందని అప్పట్లో అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. శివశంకరరెడ్డి, ఇతర కుట్రదారుల ప్రభావానికి లోనయ్యే గంగాధర్‌రెడ్డి మాట మార్చారనే అనుమానం ఉందని కోర్టుకు అప్పట్లో సీబీఐ నివేదించింది. కొన్నాళ్ల తర్వాత గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు.
ఐదో అనుమానాస్పద మరణం డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి. వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో అభిషేక్‌రెడ్డి ఒకరు. వివేకా చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకరరెడ్డి నుంచి తనకు ఫోన్‌కాల్ వచ్చిందని, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. మృతదేహం చుట్టూ రక్తపు మడుగు, ఆయన నుదుటిపై గాయాలున్నట్లు గుర్తించి, ఇది హత్యేనని భావించానంటూ 2021 ఆగస్టులో అభిషేక్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. అవినాష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకరరెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డే వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ చిత్రీకరించారని వాంగ్మూలంలో ప్రస్తావించారు. స్వతహాగా వైద్యుడు, యువకుడైన అభిషేక్‌రెడ్డి ఈ వాంగ్మూలం వెలుగుచూసిన కొన్నాళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరిలో 36 ఏళ్ల వయసులో మృతి చెందారు. దీని వెనుకా అనేక అనుమానాలున్నాయి.
ఇక ఇప్పటివరకూ నమోదైన అనుమాన్పద మరణాల్లో ఆరో వ్యక్తి వివేకా ఇంటి నైట్ వాచ్‌మన్ బి.రంగన్న. వివేకా నివాసం వద్ద కాపలా ఉన్న వాచ్‌మన్ బి.రంగన్న ఆయన హత్యలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా చూశారు. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి ఈ హత్య చేసినట్లు ఆయన సీబీఐకి, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలమిచ్చారు. ఆ తర్వాతే శివశంకరరెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తదితర ముఖ్యుల ప్రమేయం బయటపడింది. వివేకా హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి అప్పట్లో తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చారు.
వివేకా హత్య కేసులో అత్యంత కీలక సాక్షి అయిన రంగన్న ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ తొలుత పులివెందుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. రంగన్నకు గతేడాది కాలికి గాయమైందనీ, పులివెందుల నుంచి కడప, తిరుపతి, హైదరాబాద్ వరకు తీసుకెళ్లి చికిత్స చేయించామనీ, తర్వాత ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనీ, అప్పట్లో చికిత్స వివరాలు కోరినా పోలీసులు ఇవ్వలేదనీ రంగన్న కుమారుడు చెప్తున్నాడు. రంగన్నకు జరిగిన చికిత్సపై తమకు అనుమానాలున్నాయంటూ రంగన్న భార్య, కుమారుడు కాంతారావు ఆరోపిస్తున్నారు.
వివేకా హత్య కేసు మరో పరిటాల రవి హత్య కేసులా మారుతోందా? పరిటాల రవి హత్యతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇన్వాల్వ్ అయినోళ్లు.. సేమ్ టు సేమ్ ఇప్పుడు వివేకా హత్యకేసులో సాక్షులు మరణిస్తున్నట్టుగానే మట్టిలో కలిసిపోయారు. రెండు కేసుల్లోనూ హత్య చేసిన వాళ్లను పట్టుకోగలిగారు కానీ.. చేయించిన వాళ్లని ముట్టుకోలేకపోయారు పోలీసులు, దర్యాప్తు సంస్థలు. చూడబోతే ఈ రెండు కేసుల్లో మూలాలు ఒక్కటేనా అనిపించినా ఆశ్యర్యం కలగదు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేసారో, ఎవరు చేయించారో అన్ని సాక్షాలు ఉన్నా సరే సిబిఐ గాని, కేంద్ర దర్యాప్తు బృందాలు గానీ ఈ విషయంలో ముందుకు వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ కేసు మరో పరిటాల రవి కేసు లాగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 2005లో పరిటాల రవిని హత్య చేసిన తర్వాత కీలక సాక్షులు, అలాగే హత్యకు సూత్రధారులు అందరూ దాదాపుగా మరణించారు. ఆ కేసు ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం అదే. ఆ కేసులో ఉన్న మద్దెలచెరువు సూరి, మొద్దు శ్రీను సహా పలువురు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఇలాగే జరిగింది. జగన్ మామ గంగిరెడ్డి.. ఆ తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డి, అలాగే జగన్ డ్రైవర్ ఒకరు, ఇక తాజాగా.. వాచ్మెన్ రంగన్న. ఇలా పలువురు ప్రధాన సాక్షులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే ఈ కేసు మాత్రం ముందుకు వెళ్ళకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వివేకా కేసులో నిందితుల జాబితా చూస్తే.. A1 – ఎర్ర గంగిరెడ్డి, A2 – సునీల్ కుమార్ యాదవ్, A3 – ఉమాశంకర్ రెడ్డి, A4 – దస్తగిరి, A5 – దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి,
A6 – ఉదయ్ కుమార్ రెడ్డి, A7 – వైఎస్ భాస్కర్ రెడ్డి, A8 – వైఎస్ అవినాష్ రెడ్డి. ఒకానొక సమయంలో సిబిఐ అధికారులు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే వరకు వెళ్లినా ఆ తర్వాత వెనక్కు తగ్గారు. మళ్లీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే ప్రయత్నం చేయలేదు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం అక్కడే ఆగిపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇద్దరు సాక్షులు ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటే.. నిందితులు జాగ్రత్త పడుతున్నారా? ఈ మరణాల వెనుక వారి ప్రమేయం ఏమైనా ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సేమ్ టు సేమ్.. ఇలాంటి పరిణామాలే నాడు పరిటాల రవి హత్య కేసులోనూ చోటు చేసుకోవడం గమనించొద్దు.
అనంతపురం జిల్లాలోని పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల రవీంద్రను 24.01.2005న అనంతపూర్‌లోని టీడీపీ కార్యాలయ ప్రాంగణంలో 500 మందికి పైగా పార్టీ కార్యకర్తలు ఆయన చుట్టూ ఉన్నప్పటికీ… పట్టపగలు హత్య చేశారు! దుండగులు సాయుధ భద్రతా సిబ్బంది వేషంలో వచ్చారు. పార్టీ కార్యాలయం నుండి బయలుదేరబోతుండగా ముగ్గురు నిందితులు పరిటాల రవీంద్రపై రివాల్వర్లతో కాల్పులు జరిపారు. ఇతర నిందితులు టిడిపి కార్యాలయం వెలుపల బాంబులు విసిరారు. అనంతపురంలోని టూ టౌన్ పీఎస్‌లోని క్రైమ్ నంబర్ 15/2005గా స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు, ఈ కేసును 03.02.2005న సిబిఐకి బదిలీ చేశారు.
చెన్నైలోని సిబిఐ ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. పరిటాల రవీంద్ర మృతదేహాన్ని కూడా వెలికితీసి, పోస్ట్‌మార్టం పరీక్షలో ముందుగా లభించని కాట్రిడ్జ్‌లు వంటి కీలకమైన ఆధారాలను సేకరించింది. నిందితులు జూలకంటి శ్రీనివాస రెడ్డి, నారాయణ రెడ్డి, రేఖమయ్య టిడిపి కార్యాలయం లోపల పరిటాల రవీంద్రను కాల్చి చంపారని… నిందితులు రంగనాయకులు, వడ్డే సీన, వడ్డే కొండా కాల్పులు జరిగిన వెంటనే టిడిపి కార్యాలయం వెలుపల బాంబులు విసిరారని.. మిగిలిన నిందితులు అనంతపురంలో నేరం జరగడానికి ముందు, నేరం జరిగిన తరువాత నిందితులకు లాజిస్టిక్ మద్దతు అందించారనీ తేల్చింది సీబీఐ. దర్యాప్తు పూర్తయిన తర్వాత, 26.04.2005న 13 మంది నిందితులపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: మూడో బిడ్డను కంటే భారీ నజరానా . . ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ !
ఇక పరిటాల రవితో మొదలైన హత్యల పరంపర ఎడతెరిపి లేకుండా కొనసాగింది. అప్పట్లో ఎవరు ఎవరిని మట్టుబెట్టారో, ఎవరు ఎందుకు హత్యకు గురవుతున్నారో తెలియని పరిస్థితి ఉండేది. ప్రతీ హత్యా ఓ సంచలనమే. ఆ సంచలనాల్లో అనేక వాస్తవాలు మరుగున పడ్డాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. పరిటాల రవిని తానే హత్య చేశానని ఓ టీవీ చానెల్ ముందు చాతీ విరుచుకుని చెప్పిన జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శీను అనూహ్యంగా హైదరాబాదు పరిసరాల్లోని ఓ లాడ్జీలో గాయపడి పోలీసులకు చిక్కాడు. అది మొదలు పరిటాల రవి హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రతి ఒక్కరూ హత్యకు గురయ్యారు. మొద్దు శీను 2008లో అనంతపురం జిల్లా జైలులో మల్లెల ఓం ప్రకాష్ అనే అనామకుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
మొద్దు శీనును హత్య చేయడానికి ముందు ఓం ప్రకాష్ ఒక అండర్ ట్రయిల్ ఖైదీ. 2008 నవంబర్ 10న తెల్లవారుజామున 4:40 గంటల ప్రాంతంలో ఓం ప్రకాష్ ఓ కాంక్రీట్ డంబెల్ తీసుకొని మొద్దు శీను తలపై కొట్టి చంపాడు. ఈ హత్య అప్పట్లో సంచలనంగా మారింది. మొద్దు శీనును చంపడానికి ఓం ప్రకాష్‌కు కాంక్రీటు డంబెల్ ఎలా వచ్చిందని చాలామంది ప్రశ్నించారు. ఈ హత్య తరువాత మరుగున పడింది. అప్పటి నుండి ఓం ప్రకాష్ జైలు శిక్ష అనుభవిస్తు.. 2016లో వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలించిన కొన్ని నెలల్లోనే అనారోగ్యంతో చనిపోయాడు. ఇక అదే వరుసలో సాంబశివరావు అనే వైద్యుడి శవం దిక్కూ మొక్కూ లేకుండా నడికుడి వద్ద రైల్వే ట్రాక్‌పై కనిపించింది. ఈ వైద్యుడు చర్లపల్లి జైల్లో సూరికి సెల్‌ఫోన్లు అందజేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అతని పని అయిపోయినట్లు చెబుతారు. ఇక పరిటాల రవి హత్యకు ఆయుధాలు అందించాడని ఆరోపణలున్న అజీజ్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాదులో పోలీసు కాల్పుల్లో మరణించాడు. పరిటాల రవి హత్యోదంతంతో మొదలైన సీరియల్ కిల్లింగ్స్ సూరి దాకా నడిచాయి. మద్దెలచెర్వు సూరి తన అనుచరుడు భాను కిరణ్ చేతిలోనే అంతమయ్యాడు.
వివేకా హత్య కేసులో పాత్రధారుల్ని పట్టుకున్నారు. కానీ సూత్రధారులు ఎవరో తేల్చాల్సి ఉంది. సూత్రధారులుగా అనుమానిస్తున్న పెద్ద తలలను టచ్ చేయాలని దర్యాప్తు సంస్థలు ప్రయత్నించిన ప్రతిసారీ.. ఏవో ఆటంకాలు వచ్చిపడుతున్నాయ్. ఇన్వెస్టిగేషన్‌కి బ్రేక్ పడిపోతోంది. ఏది ఏమైనా… నిందితులు, అనుమానితులు, బాధితులు ఇలా ఏ రకంగా చూసినా వివేకా హత్య కేసు.. వైఎస్ కుటుంబాలలోని వారు, వారితో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తుల చుట్టూతనే తిరుగుతోందన్నది వాస్తవం. ఇక ఆరోపణలు అనండీ, ఊహాగానాలు అనండీ, కట్టు కథలు అనండీ… నాడు పరిటాల హత్య కేసులోనూ… వైఎస్ ఫ్యామిలీ పేరు వినబడటం మరొక ఆశ్చర్యకర అంశం.
ఈ మాటలంటోన్న వ్యక్తి పేరు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి. వైఎస్సార్‌సీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి స్వయానా సోదరుడీయన. మొద్దు శ్రీనుకు వైఎస్ ఒక్క మాట చెప్పి ఉన్నట్టయితే చంద్రబాబుని ఇంట్లోనే చంపేసేవాడని గతంలో తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పరిటాల రవీంద్రను హత్య చేసింది మొద్దు శీను. మరి ఆ హత్యకు ఆదేశించింది ఎవరు అనే దానికి సమాధానమే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అంటూ అప్పట్లో టీడీపీ తమ్ముళ్లు ఆరోపించారు. పరిటాల రవి హత్య కేసును తిరిగి తవ్వాలనీ, అసలు వైఎస్ రాజశేఖరరెడ్డికి, మొద్దు శీనుకు సంబంధమేంటో తేల్చాలని కూడా అప్పట్లో డిమాండ్ చేశారు. ఇక పరిటాల రవి హత్యకు సంబంధించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డిపైనా అప్పట్లో అనేక ఊహాగానాలతో కూడిన కథనాలు ప్రచారంలోకి వచ్చిన సంగతీ తెలిసిందే.
పరిటాల, వివేకా.. ఈ రెండు హత్యల తర్వాత ఒకే విధమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండటం, ఒకే పంథాలో ఏళ్ల తరబడి దర్యాప్తు చేయాల్సి రావడం, సాక్షులు, సంబంధం ఉన్న వ్యక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుండటం… జస్ట్ కో ఇన్సిడెంటా? లేక ఒక్కరే రాసిన స్క్రిప్టా? ఆ దేవుడికే తెలియాలి.