Tariff on Mexico: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికోపై విధించాల్సిన సుంకాలను ఏప్రిల్ 2 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌తో ఫోన్ ద్వారా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ తెలిపారు. “మెక్సికో అధ్యక్షురాలిని గౌరవిస్తున్నాను, మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాస్త సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా,” అని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. మెక్సికో, కెనడా, అమెరికాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందం ప్రకారం, ఏప్రిల్ 2 వరకు మెక్సికోపై అదనపు సుంకాలు ఉండవని స్పష్టం చేశారు. అయితే, ఆ తర్వాత ఈ ప్రతీకార సుంకాలను తిరిగి అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇక, కెనడాపై మాత్రం ట్రంప్ తన వైఖరిని కఠినంగా ఉంచారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, సుంకాల విధింపును తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. ట్రూడో మాత్రం అమెరికా విధించిన సుంకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. “కొన్ని రంగాల్లో వెసులుబాట్లు వచ్చినా, వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అమెరికా విధించిన సుంకాలను పూర్తిగా తొలగించడమే నా లక్ష్యం,” అని ట్రూడో పేర్కొన్నారు.
Also Read: SSMB29: మహేష్ బాబు – రాజమౌళి మ్యాజిక్ మళ్లీ.. ‘SSMB29’ షూటింగ్ జోరుగా!
Tariff on Mexico: డొనాల్డ్ ట్రంప్ జనవరిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెక్సికో, కెనడాలపై సుంకాల విధింపును అనేకసార్లు హెచ్చరించారు. అమెరికాకు అక్రమ వలసలను అడ్డుకోవడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం లక్ష్యంగా సుంకాల విధింపును సమర్థించారు. మరోవైపు, ట్రంప్ నిర్ణయానికి చైనా కూడా స్పందించింది. “మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అనేది అమెరికా సమస్య. దీనికి పరిష్కారం సుంకాల విధింపుతో రాదు,” అని చైనా అధికార ప్రతినిధులు వ్యాఖ్యానించారు.
అమెరికా వాణిజ్య లోటు జనవరిలో భారీ స్థాయికి చేరుకుంది. ఇది 34% పెరిగి 131.4 బిలియన్ డాలర్లను తాకింది. దీనితో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.