Malakpet Murder Mystery: అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఒక హత్యా చేశారు.. అది కూడా ఎవరినో కాదు అన్న భార్యనే.. భార్యను చంపిందే కాక మృతదేహాన్ని మాయం చెయ్యడానికి ప్లాన్ వేశారు..తన భర్త ఎంతో బాగా చూసుకుంటాడు అని నమ్మి ప్రేమ వివాహం చేసుకుంది కానీ ఆ భర్త చేతిలోనే శవం అవుతాను అనుకోలేదు.. ఐదేళ్ల పాప ఉంది అనే ఆలోచన కూడా లేకుండా మత్తు మందు ఇచ్చి ఊపిరాడకుండా చేసి చంపేశారు.. ఇప్పుడా బిడ్డకి తన తల్లిని చంపిన అత్తనే తల్లి అవుతుందా.
హైదరాబాద్ మలక్‌పేట్ వివాహిత శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీషను ఆమె భర్త సోదరి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. భార్య హత్య విషయం తెలిసినప్పటికీ బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని మాయం చేసేందుకు భర్త వినయ్ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. శిరీషకు మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. శిరీష్ భర్త వినయ్, అతడి సోదరి, మరో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన శిరీష తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే మరణించారు. దీంతో కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ శిరీషను దత్తత తీసుకున్నారు. 2016లో నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌తో శిరీష ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహం ఇష్టం లేని ప్రొఫెసర్ కుటుంబం శిరీషను దూరం పెట్టారు. దీంతో వీరిద్దరూ మలక్‌పేటలోని జమున టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. గతంలో ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. శిరీష స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. వీరిద్దరికీ 2019లో ఓ పాప జన్మించింది.
Also Read: Chhattisgarh: ఘోర రోడ్డు ప్రమాదం, కారు, ట్రక్కు ఢీ.. ఐదుగురు స్పాట్ డెడ్
భార్యపై అనుమానం పెంచుకున్న వినయ్ నిత్యం గొడవ పడేవాడు. ఈ నెల 2వ తేదీన భార్య సోదరి స్వాతికి ఫోన్ చేసిన వినయ్.. శిరీష గుండెనొప్పితో మరణించినట్టు చెప్పాడు. ఈ విషయాన్ని స్వాతి తన మేనమామకు చెప్పింది. ఆయన శిరీష నెంబర్ కు ఫోన్ చేసి తానొచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని చెప్పాడు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆసుపత్రిలో సంప్రదించగా… ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్నారు.
ఆసుపత్రి నుంచి అంబులెన్స్ డ్రైవర్ నంబర్ తీసుకున్న శిరీష బంధువులు పోలీసులతో ఫోన్ చేయించారు. దీంతో వారు దోమలపెంట సమీపంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. పోలీసుల సాయంతో అంబులెన్స్ డ్రైవర్, వినయ్‌తో ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని నగరానికి తిరిగి రప్పించారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

