Telangana Cabinet:తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై అంతటా ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఈ రోజు (మార్చి 6) ఈ సమావేశం జరగనున్నది. రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నది. ఈ సమావేశంలో ప్రధానంగా కులగణన, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ నివేదిక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా ఇదే సమావేశంలో చర్చించనున్నారు.
Telangana Cabinet:రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సంబంధించి రెండో విడత సర్వేను ఇటీవలే పూర్తిచేసింది. దీంతో కులగణనపై స్పష్టత వచ్చిందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ దశలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణను క్యాబినెట్‌లో ఆమోదం తెలిపి, అసెంబ్లీలోనూ ఆమోదించి కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుపైనా చర్చించే అవకాశం ఉన్నది.
Telangana Cabinet:జనవరి 26న ప్రారంభించిన కొన్ని పథకాల అమలుపైనా రాష్ట్ర క్యాబినెట్ చర్చించనున్నదని సమాచారం. దానిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన రేషన్ కార్డుల పంపిణీ తేదీని ప్రకటించే అవకాశం ఉన్నది. దీంతోపాటు ఆయా పథకాల అమలుపైనా డిస్కషన్ చేయనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా అమలుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది. ఇప్పటివరకూ 3 ఎకరాల లోపు రైతులకు నగదు పంపిణీ అన్నా, ఇంకా ఎకరం, రెండెకరాలు, మూడెకరాల లోపు ఉన్న ఎందరో రైతులకు నగదు జమకాలేదు. దీనిపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. తొలి నుంచి ఊరిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని అనుకున్న గడువు మేరకు అమలు చేయకపోవడంపైనా జనం నుంచి వస్తున్న విమర్శలపైనా ఏం చేయాలన్న దానిపై కూడా చర్చిస్తారని తెలుస్తున్నది.
Telangana Cabinet:ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైనా రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఒక గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవమే అని చెప్పుకోవాలి. ప్రధాన గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి గెలుపు కాంగ్రెస్‌కు శరాఘాతమే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఒక చోట బీజేపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందగా, మరోచోట బీఆర్ఎస్ అనుకూల అభ్యర్థి విజయం సాధించారు. దీంతో పథకాల అమలులో ప్రజల్లో వచ్చే వ్యతిరేకతకు ఇదే నిదర్శనమనే విషయాన్ని చర్చకు పెట్టే చాన్స్ ఉన్నది.