Rohit Sharma: రోహిత్‌ శర్మపై కాంగ్రెస్‌ బాడీషేమింగ్‌.. భాజపా ‘రాహుల్‌’ కౌంటర్‌

Rohit Sharma: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నాయకురాలికి భాజపా గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది.

భారత క్రికెట్‌ జట్టు సారథి, స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)పై కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకురాలు బాడీషేమింగ్‌కు పాల్పడ్డారు. అతడిని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన భాజపా (BJP).. ప్రతిపక్ష నేతపై విరుచుకుపడింది. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) క్రికెట్‌ ఆడాలని కోరుకుంటున్నారా? అని ఎద్దేవా చేసింది. అసలేం జరిగిందంటే..?

ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy)లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ ఆకట్టుకోలేకపోయాడు. 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై కాంగ్రెస్‌ (Congress) అధికార ప్రతినిధి శమా మహమ్మద్‌ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘క్రీడాకారుడిగా రోహిత్‌ శర్మ ఫిట్‌గా లేడు. అతడు బరువు తగ్గాలి. అంతేకాదు.. గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని సారథి ఇతడే’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ కాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది.

అక్షర్‌ పాదాలను టచ్‌ చేయబోయిన విరాట్.. వీడియో వైరల్!

దీనిపై భాజపా అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారి స్పందిస్తూ కాంగ్రెస్‌కు గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు..! భారత క్రికెట్‌ కెప్టెన్‌నూ వారు వదలట్లేదు. రాజకీయాల్లో విఫలమైన వారి నేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు క్రికెట్‌ ఆడాలని వారు కోరుకుంటున్నారేమో..!’’ అని ఎద్దేవా చేశారు. పార్టీకి చెందిన మరో ప్రతినిధి షెహ్‌జాద్‌ పూనావాలా మాట్లాడుతూ.. ‘‘రాహుల్‌ గాంధీ కెప్టెన్సీలో వారు 90 ఎన్నికల్లో ఓడిపోయారు. దిల్లీలో డకౌట్‌ అయ్యారు. టీ20 ప్రపంచకప్‌ తెచ్చిన వ్యక్తి కంటే.. ఇదే వారికి ఆకట్టుకునే అంశమేమో..? భారతీయ సంస్థలు, మన సాయుధ దళాలను వ్యతిరేకించే ఆ పార్టీ ఇప్పుడు క్రీడాకారులపైనా విమర్శలు గుప్పిస్తోంది. వారివి ప్రేమ దుకాణాలు కాదు.. విద్వేష కేంద్రాలు’’ అని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ నాయకురాలి కామెంట్లపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఈ వివాదంపై ఆమె స్పందిస్తూ.. ‘‘నేను కేవలం సాధారణ కోణంలోనే చెప్పాను. ధోనీ, కోహ్లీ, కపిల్‌ దేవ్‌ వంటి గత కెప్టెన్లను రోహిత్‌తో పోలుస్తూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశంలో మాకు మాట్లాడే హక్కు కూడా లేదా?’’ అని ప్రశ్నించారు.

స్పందించిన కాంగ్రెస్‌..

ఈ వివాదం ముదరడంతో కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ‘‘స్టార్‌ క్రికెటర్‌పై కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి శమా చేసిన వ్యాఖ్యలు.. పార్టీ వైఖరిని ప్రతిబింబించవు. ఆ పోస్ట్‌ను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని ఆమెను ఆదేశించాం. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాం. దేశ క్రీడాకారులను మా పార్టీ అత్యున్నతంగా గౌరవిస్తుంది. వారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎలాంటి ప్రకటనలను మేం ఆమోదించబోం’’ అని పార్టీ సీనియర్‌ నేత పవన్‌ ఖేడా ‘ఎక్స్‌’లో రాసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *