Hydra: సున్నం చెరువులో నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్న వలస కూలీలపై హైడ్రా మరోసారి కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి సున్నం చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు.
సున్నం చెరువు పరిసరాల్లో నివాసం ఏర్పరచుకున్న వలస కూలీలతో ఆయన మాట్లాడారు. మార్చి 8వ తేదీ లోపు అక్కడి నివాసాలను ఖాళీ చేయాలని సూచించారు. లేనిపక్షంలో, సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో నిర్మించిన గుడిసెలు, ఇతర నిర్మాణాలను కూల్చివేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అంతేకాక, సున్నం చెరువును పుడికతీత కోసం సిద్ధం చేయడానికి అందులోని నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా, చెరువు నీరు బయటకు వెళ్లేలా బ్రిడ్జి కింద భాగాన్ని కూల్చి నీటిని వెళ్ళగొట్టే ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులతో పాటు, ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు.