Telangana: తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖకు వివాదాలు చుట్టుముట్టాయా? అన్నిచోట్ల ఆమె ఒంటరవుతున్నారా? అందరితోనూ వైరమే అవుతుందా? ఆమె మాటల తీరు ప్రభుత్వ పెద్దలకే మచ్చను తెచ్చి పెడుతున్నాయా? మొత్తంగా ఆమె పదవికే ఎసరు పెట్టేదాకా పరిణామాలు దారితీశాయా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా సురేఖ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారని ఆమె మద్దతుదారులు సైతం ఒప్పుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.
Telangana: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ గెలిచినప్పటి నుంచి వివాదాలు ముసురుకున్నాయి. గతంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ఫోన్ లో ధమ్కీ ఇవ్వడం అప్పట్లో సీఎం రేవంత్‌రెడ్డి మందలించే వరకు వెళ్లిందని టాక్. అప్పటినుంచే తనకు సన్నిహితుడైన ప్రకాశ్‌రెడ్డితో వివాదం నాటి నుంచి ముఖ్యమంత్రి ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై కొండా మురళి ఓ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేయడమూ మంత్రి దంపతులకు మైనస్‌గా మారిందని చెప్పుకుంటారు. ఇదే సమయంలో కొండా సురేఖ అనుచరుల వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఏకంగా సీఎంకే ఫిర్యాదులు అందినట్టు ప్రచారం జరిగింది. ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ కూడా ఇదే విషయం చెప్పిందని టాక్.
Telangana: బీఆరెస్ నేత కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సినీనటులైన నాగార్జున, నాగచైతన్య, సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అటు నాగార్జున, ఇటు కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావాలు, కేసులు వేసేదాకా పరిస్థితి చేయిదాటింది. ఈ కేసులు ఎటు దారితీస్తాయోననే ఆందోళన ఒకవైపు ఉండగా ఆమెకు మరో చిక్కొచ్చిపడింది.
Telangana: పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో తన క్యాడర్‌ను రక్షించుకునే క్రమంలో మంత్రి కొండా సురేఖ.. మరో వివాదాస్పద వ్యవహారానికి తెరతీశారు. తన వర్గానికి చెందిన కొందరిని అరెస్టు చేయడంపై ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి, సీఐ కుర్చీలో కూర్చొని తన వర్గీయులను ఎట్ల ఆరెస్టు చేస్తారు? అంటూ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వర్గం వారిని విడిచిపెట్టాలంటూ వరంగల్ సీపీకి ఆదేశాలను జారీ చేశారు. ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకొని కూర్చొగా స్వయంగా సీఎం, ఇతర పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతోనే ఆమె అక్కడి నుంచి కదిలారని సమాచారం.
Telangana: ఇటీవల ఓ మహిళతో మంత్రి ఫోన్ సంభాషణ బయటకు పొక్కి వైరల్ అయింది. ఈ సంభాషణలో భాష జుగుప్సాకరంగా ఉన్న విషయం తేటతెల్లమైంది. ఈ ఆడియోలో ఉన్న తీవ్రమైన దుర్భాషలు సమాజమంతా ఖండిస్తున్నది. ఇలా ప్రతీ అంశంలోనూ ఆమెకు అడ్డంకులే కలుగుతున్నాయన్నది ఆమె వర్గీయుల వాదన. ఆమె కొనితెచ్చుకున్న వివాదాలు కొన్నయితే, ప్రభుత్వం, పార్టీ పెద్దల నుంచే ఆమెను దూరం పెట్టాకే ఆమెకు మరిన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయని మరో వాదన.
Telangana: మంత్రి కొండా సురేఖకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇతర ఎమ్మెల్యేలు విలువ ఇవ్వడం లేదని ప్రచారం ఉన్నది. నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు జిల్లా మంత్రిగా ఆమెకు కనీసం ఆహ్వానం కూడా ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. ఆమెపై ఏకంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా చేసి ఆయన కనుసన్నల్లోనే జిల్లా అంతా పాలన సాగేలా చక్కబెట్టినట్టు ప్రచారం. ఇదేకాకుండా మంత్రి వర్గీయుల ఆగడాలతో తాము వేగలేకపోతున్నామని ఏకంగా జిల్లా ఎమ్మెల్యేలు కొందరు అధిష్ఠానానికి ఫిర్యాదులు సైతం చేశారని వినికిడి.
Telangana: మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వైఖరి వల్ల కాంగ్రెస్ పార్టీకి తలవంపులు వస్తున్నాయని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చేలా ఆమె వ్యవహారం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వరంగల్ మేయర్ కాంగ్రెస్‌లో చేరిక విషయం మంత్రి సురేఖకు చెప్పని నాటి నుంచి, తాజాగా పరకాలలో ఆమె వర్గీయులపై కేసులు కొట్టేయాలనే విషయం వరకు పలు చికాకులతో ఆమె అతలాకుతలం అవుతున్నారు.
Telangana: కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేలకు వివాదం సీఎం రేవంత్‌రెడ్డికి, పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. దీంతో వరంగల్ వివాదాలను పరిష్కరించే బాధ్యతను మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం అప్పగించింది. జిల్లాలో గొడవలకు ముగింపు పలికేందుకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో రానున్న పంచాయతీ, ఇతర స్థానిక ఎన్నికల్లో పార్టీకి నష్టం రాకుండా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కుదుర్చాలని సూచించింది.
Telangana: ఒక తప్పును సరిదిద్దుకోబోయి మరో తప్పు జరిగేలా ఆమె వ్యవహారం రచ్చకెక్కుతున్నది. ఇలా వరుస వివాదాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై అధిష్ఠానం చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నదని ప్రచారం జరిగింది. అయితే ఎందుకో సద్దుమణిగింది. అయితే మంత్రి వర్గ విస్తరణ సమయంలో కొత్తవారికి పదవులు ఇచ్చే క్రమంలో ఈమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తారన్నది కాంగ్రెస్ పార్టీలోనే ఓ వర్గం వాదన.

