Pm modi: మహా కుంభమేళాను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. హిందూ మత విశ్వాసాలపై దాడి చేయడం కొందరి బానిస మనస్తత్వాలను ప్రతిబింబిస్తుందని ఆయన మండిపడ్డారు. మన నమ్మకాలు, దేవాలయాలు, సంస్కృతి, సిద్ధాంతాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు.
హిందూ మతాన్ని వెక్కిరిస్తూ, తప్పుబడుతూ, దేశాన్ని బలహీనపర్చేందుకు విదేశీ శక్తులకు కొందరు నాయకులు అండగా నిలుస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. ప్రజల్లో చీలికలు తీసుకురావడం వారి అసలు ఉద్దేశమని, ఇలాంటి ప్రయత్నాలకు దేశ ప్రజలు తగిన సమాధానం ఇస్తారని చెప్పారు.
మహా కుంభమేళా వంటి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మహోత్సవం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయడం సహజమేనని, భవిష్యత్ తరాలకు ఇది ఐక్యతా చిహ్నంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
మధ్యప్రదేశ్లోని భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.