Rekha Gupta:

Rekha Gupta: ఎవ‌రీ రేఖాగుప్తా.. విద్యార్థి రాజ‌కీయాల‌ నుంచి ఢిల్లీ సీఎం దాకా ప్ర‌స్థానం

Rekha Gupta: ఎట్ట‌కేల‌కు ఢిల్లీ ముఖ్య‌మంత్రి పీఠం రేఖాగుప్తానే వ‌రించింది. ఈ మేర‌కు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన‌ బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 20న‌) మ‌ధ్యాహ్నం ఆమెతోపాటు కొంద‌రు మంత్రులుగా ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఢిల్లీకి ఆమె నాలుగో మ‌హిళా ముఖ్య‌మంత్రి కావ‌డం, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్య‌మంత్రి పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం విశేషం. విద్యార్థి రాజ‌కీయాల నుంచి ఆమె ముఖ్య‌మంత్రి స్థాయి వ‌ర‌కు ఆమె రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి తెలుసుకుందాం.

Rekha Gupta: రేఖా గుప్తా 1974 జూలై 19న‌ హ‌ర్యానా రాష్ట్రంలోని జులానాలో జ‌న్మించారు. చిన్న‌నాటి నుంచే రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్‌) భావ‌జాలానికి ప్ర‌భావితురాల‌య్యారు. 1998లో మనీశ్‌గుప్తాను ఆమె వివాహ‌మాడారు. ఆమె భ‌ర్త మ‌నీష్ గుప్తా స‌హ‌కారం, స‌మాజానికి మంచిచేయాల‌ని ఆమె సంక‌ల్పం.. రేఖాగుప్తాను ఈ స్థాయికి తీసుకొచ్చిందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తంచేస్తున్నారు.

Rekha Gupta: 1992లో ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యంలోని దౌల‌త్‌రామ్ క‌ళాశాల‌లో ఏబీవీపీ ద్వారా రేఖాగుప్తా రాజ‌కీయ ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. 1996-97లో ఆమె ఢిల్లీ విశ్వ‌విద్యాల‌య విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) అధ్య‌క్షురాల‌య్యారు. ఆ స‌మ‌యంలో విద్యార్థుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి విశేషంగా కృషి చేశారు. 2007లో ఉత్త‌ర పితంపురా నుంచి తొలిసారిగా రేఖాగుప్తా కౌన్సిల‌ర్‌గా ఎన్నిక‌య్యారు.

Rekha Gupta: కౌన్సిల‌ర్‌గా త‌న ప్రాంతంలో ప్ర‌జ‌ల‌కు ప్రాథ‌మిక స‌దుపాయాలు, గ్రంథాల‌యాలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటుతోపాటు ప‌చ్చ‌ద‌నానికి ఊత‌మిచ్చే ఎన్నో కార్య‌క్ర‌మాల అమ‌లుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేశారు. మ‌హిళ‌లు, పిల్ల‌ల కోసం సుమేధ యోజ‌న వంటి కార్యక్ర‌మాల‌ను ఆమె ప్రారంభించారు. ఇది ఆర్థికంగా బ‌ల‌హీనంగా ఉన్న విద్యార్థినులు ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించ‌డానికి తోడ్పాటును అందించింది.

Rekha Gupta: రేఖాగుప్తా ఢిల్లీలోని బీజేపీ మ‌హిళా మోర్చా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఆ త‌ర్వాత ఆ పార్టీ జాతీయ కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌భ్యురాలిగా కూడా ప‌నిచేశారు. అలాగే మ‌హిళా సంక్షేమం, శిశు అభివృద్ధి క‌మిటీ అధ్య‌క్షురాలిగా మ‌హిళా సాధికార‌త ప్ర‌చారానికి ఆమె నేతృత్వం వ‌హించారు. ఆ క్ర‌మంలో అణ‌గారిని వ‌ర్గాలు, మ‌హిళా సంక్షేమం కోసం ప్ర‌చార కార్యక్ర‌మాల్లో విరివిగా పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలోనే ఆమె నాయ‌క‌త్వ ప‌టిమ మెరుగుప‌డింది.

Rekha Gupta: విద్యార్థి నాయ‌కురాలిగా రాజ‌కీయ‌ ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన రేఖాగుప్తా పితంపురా కార్పొరేట‌ర్‌గా, చివ‌రికి షాలిమ‌ర్ బాగ్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఢిల్లీ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించ‌నున్నారు. ఆమె కంటే ముందు ముగ్గురు మ‌హిళా నేత‌లు ఢిల్లీ ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేశారు. ఆమెకు పోటీగా ఎంద‌రు ఉన్నా, మ‌హిళా నేత‌గా, క‌మిట్‌మెంట్ ఉన్న కార్య‌క‌ర్త‌గా ఆమెకే ప‌ద‌వి వ‌రించ‌డం విశేషం.

Rekha Gupta: ఢిల్లీ రాష్ట్రానికి నాలుగో మ‌హిళ ముఖ్య‌మంత్రిగా రేఖాగుప్తా గురువారం బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. గ‌తంలో సుష్మా స్వ‌రాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్‌), ఆతిశీ (ఆప్‌)లు ఢిల్లీ రాష్ట్రానికి మ‌హిళా ముఖ్య‌మంత్రులుగా కొన‌సాగారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండ‌గా, అంద‌రూ పురుష సీఎంలే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆ లోటును భ‌ర్తీ చేసేందుకే బీజేపీ వ్యూహాత్మ‌కంగా మ‌హిళా నేత అయిన రేఖాగుప్తాను ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *