Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్యం అందించే పాకిస్థాన్ జట్టు అత్యంత ప్రమాదకరమైనదని వారి మాజీ క్రికెటర్లు ఇతర జట్లను హెచ్చరిస్తుంటే…, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ మాత్రం తన జట్టు అంతగా ప్రమాదకరమైనది కాదని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీని తన జట్టు గెలవడం చాలా కష్టం అని, అంతటి మంచి జట్టును కూడా కలిగి లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 1996 వన్డే ప్రపంచకప్ తర్వాత, పాకిస్థాన్ ఇప్పుడే మళ్లీ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం అందిస్తోంది.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరలేవనుంది. సొంత మైదానంలో ఈ టోర్నీ జరుగుతుండటం పాకిస్థాన్‌కు ప్రయోజనం అని, మరియు ఆ జట్టు టైటిల్ రేసులో ఉంటుందని ఇతర దేశాల మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, కమ్రాన్ అక్మల్ తనకు నమ్మకం లేదని చెప్పాడు.
మొత్తం దేశం గర్వించే క్షణాలు ఇవే. మేము చివరిసారిగా 1996 వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం అందించాం… మళ్ళీ ఇప్పుడు మళ్లీ అవకాశం లభించిందని అక్మల్ అన్నాడు. ఈ టోర్నీని విజయవంతంగా ముగిస్తే భవిష్యత్తులో మాకు మరిన్ని టోర్నీలకు ఆతిథ్యం అందించే అవకాశం లభిస్తుంది అని కమ్రాన్ అన్నాడు. టోర్నీ ముగిసేటప్పుడు ప్రతి జట్టు మా ఆతిథ్యం గురించి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఈ టోర్నీ కోసం గత నాలుగు నెలలుగా మేము చాలా కష్టపడ్డాం. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం అందించగలదా? అనే చర్చ కూడా జరిగింది. ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించి టోర్నీ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. భారత్.. పాకిస్థాన్‌లో పర్యటించనుందుకు బాధగానే ఉంది అని ఈ పాక్ మాజీ ప్లేయర్ అన్నాడు.
Also Read: Roasted Guava Benefits: ఈ జామకాయ తింటే.. ఎన్ని లాభాలో తెలిస్తే తినకుండా ఉండలేరు
అయితే, ఈ రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక విషయాలు చాలా సున్నితమైనవి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారని ఇప్పుడే చెప్పలేం. అయితే పాకిస్థాన్ జట్టుకు మాత్రం అవకాశాలు తక్కువే. జట్టులో చాలా లోపాలు, బలహీనతలు ఉన్నాయి. బౌలింగ్‌లో ఇబ్బందులు ఉండటంతో పాటు నాణ్యమైన స్పిన్నర్లు లేరు. బ్యాటింగ్‌లోనూ సమస్యలు ఉన్నాయి. ఇంకాస్త మెరుగైన జట్టును ఎంపిక చేయాల్సింది అని అన్నాడు.
నా అంచనా ప్రకారం భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు వస్తాయని భావిస్తున్నా. పాకిస్థాన్ సెమీస్ చేరితేనే గొప్ప ఘనత. టైటిల్ గెలిచే అర్హత మాత్రం లేదు.. అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు. ఇక వారితో పాటు ఆస్ట్రేలియా జట్టు కూడా పేలవ ప్రదర్శన ఇస్తుందని అక్మల్ అభిప్రాయపడ్డాడు. గాయాల కారణంగా ఆ జట్టుకు ప్రధాన బౌలర్లు దూరం అయ్యారు. దీంతో ఆ జట్టు కూడా బలహీనపడింది అని… కాబట్టి వాళ్లకు కూడా అంత సీన్ లేదని అభిప్రాయపడ్డాడు.