KTR: తెలంగాణ రాజకీయాల్లో విమర్శల సునామీ కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆడబిడ్డల కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ నెరవేర్చలేదని, పైగా ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆమన్‌గల్‌లో జరిగిన రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్, రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో మహిళలకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన రేవంత్, అత్తలకు రూ. 4,000, కోడళ్లకు రూ. 2,500 పెన్షన్ ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ రూ. 500కు అందిస్తామని, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన రేవంత్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు.
“35 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చాడు, కానీ 35 పైసలు కూడా తెచ్చుకోలేకపోయాడు” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాలో రివర్స్ మైగ్రేషన్ జరిగి ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు రావడం మొదలయ్యిందని గుర్తుచేశారు. కానీ రేవంత్ పాలనలో కేవలం ఒక్క ఏడాదిలోనే పరిస్థితి మారిపోయిందని, రైతులు, ప్రజలు తిరిగి వలస వెళ్ళే దశకు చేరుకున్నారని విమర్శించారు.
ఇంట్లో లోన్ కట్టలేదని చెప్పి గేట్లు, స్టాటర్లు తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. రేపో మాపో రేవంత్ రెడ్డి పుస్తెల తాడు కూడా ఎత్తుకుపోతాడేమో అని ఆయన సెటైర్లు వేసారు.