Cm revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో జరిగిన ఒక ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఐఏఎస్ అధికారుల సంఘం కార్యాలయంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తన రాజకీయ ప్రయాణంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్, మండలి సభ్యుడు, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అనేక హోదాల్లో పని చేశానని, ఈ క్రమంలో అనేకమంది అధికారులను చూడగలిగిన అనుభవం ఉందని చెప్పారు. గతంలో అధికారులు ప్రజలతో మమేకమై పనిచేసేవారని, ప్రజాసేవలో నాయకులకు సలహాలు ఇచ్చి, మార్గనిర్దేశం చేసేవారని గుర్తుచేశారు.
నాయకులు ప్రజలను ఆకర్షించేందుకు అనేక హామీలు ఇస్తారని, కానీ ఆ హామీలు సాధ్యమా కాదా, వాటికి ఎలాంటి అవరోధాలు ఉంటాయి అనే విషయాలను వివరించి, నాయకులను సరైన దారిలో నడిపించే బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు. అయితే, ప్రస్తుతం అలాంటి బాధ్యత తీసుకునే అధికారులు కనిపించడం లేదని, ఇది ఆందోళన కలిగించే విషయం అని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడిప్పుడు కొత్తగా విధుల్లో చేరే అధికారులు సీనియర్లను చూసి నేర్చుకోవాలని, ఏసీ గదుల్లో కూర్చొని పరిపాలన చేయడం కంటే, ప్రజల మధ్య వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. తప్పు చేయొద్దు అని చెప్పేవారు కంటే, మూడు తప్పులు చేద్దాం అని చెప్పేవాళ్లే ఎక్కువమంది ఉన్నారు అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.