Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు, అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లాంటి నాయకులు కూడా యూత్ కాంగ్రెస్ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని గుర్తుచేశారు.
ప్రజల ఆకాంక్ష మేరకు మార్పు రావాలని, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. యూత్ కాంగ్రెస్ నిరంతరం శ్రమించి ప్రజల కోసం పోరాటం చేస్తోందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. ధాన్యానికి బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి పథకాలు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనంతగా తమ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని తెలిపారు.
కేంద్రంపై విమర్శల
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. రాష్ట్ర అవసరాలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీహార్, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తూనే, తెలంగాణకు మాత్రం మోసపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మెట్రో నిర్మాణం, మూసీ నది శుద్ధీకరణ వంటి ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించలేదని తెలిపారు.
ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం త్వరలోనే కేంద్రానికి వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.