Achemnaidu: బర్డ్ ఫ్లూ పై మంత్రి అచ్చెన కీలక వ్యాఖ్యలు..

Achemnaidu: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ ప్రభావాన్ని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, పశు సంవర్థక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని పౌల్ట్రీ ఫార్ముల్లో కోళ్లు మృతిచెందుతున్న ఘటనలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు.

కోళ్ల మృతి వివరాలు

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయని, అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోళ్లు మృతిచెందుతున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ముఖ్యంగా ఏలూరు జిల్లా బాదంపూడిలో 2 లక్షల కోళ్లు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో 7 వేల కోళ్లు మృతిచెందినట్టు నివేదికలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

ఈ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు శాంపిళ్లు భోపాల్‌లోని ఆధునిక ప్రయోగశాలకు పంపించామని, నిన్న అందిన నివేదిక ప్రకారం అవి బర్డ్ ఫ్లూ వల్లనే చనిపోయినట్టు తేలిందని మంత్రి తెలిపారు.

తగిన చర్యలు – ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 లక్షల కోళ్లు చనిపోయినట్టు నిర్ధారణ అయిందని, అయితే 40 లక్షల కోళ్లు మృతిచెందినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు.

ఈ వైరస్ మరింత వ్యాపించకుండా కోళ్లు చనిపోయిన ప్రాంతాల్లో 10 కి.మీ పరిధిలోని పౌల్ట్రీ షాపులను తాత్కాలికంగా మూసివేశామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే 70 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు పెరిగితే ఈ వ్యాధి సహజంగానే అదుపులోకి వస్తుందని వివరించారు.

చికెన్, గుడ్లు తినడంపై అపోహలు వద్దు

తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ ప్రభావం వల్ల లక్షలాది కోళ్లు మృతిచెందాయని సమాచారం. ఈ నేపథ్యంలో చికెన్, గుడ్లు తినడంపై ప్రజలు ఎటువంటి అపోహలు పెంచుకోవద్దని పశు సంవర్థక శాఖ అధికారులు సూచిస్తున్నారు. 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో చికెన్, గుడ్లు ఉడకబెట్టి తినడమే ఉత్తమమైన మార్గమని అధికారులు స్పష్టం చేశారు.

పౌల్ట్రీల శుభ్రత చాలా కీలకం

పౌల్ట్రీ ఫార్ముల్లో శానిటేషన్ సరిగ్గా నిర్వహించకపోవడం వల్లనే ఈ వైరస్ ప్రబలిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కాబట్టి అన్ని ఫార్ముల్లో శుభ్రత పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *