IND vs ENG 2nd ODI: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఫ్లడ్ లైట్లు పని చేయకపోవడం వల్ల ఆట దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు బీసీసీఐని తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనతో ఒడిశా ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి, వెంటనే చర్యలు తీసుకుంది. మ్యాచ్ తర్వాత క్రీడా మంత్రి సూర్యవంశీ సూరజ్, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (OCA)కు నోటీసు పంపారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు.
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 6.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 48 పరుగులు చేసింది. అనంతరం, లాంగ్ ఆన్ బౌండరీ వద్ద ఉన్న టవర్ నుంచి విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ డగౌట్‌కు వెళ్లారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లారు.
ఓసీఏ వర్గాలు చెప్పిన దాని ప్రకారం, సాంకేతిక సమస్య వల్ల జనరేటర్ పనిచేయడం ఆగిపోయింది. కొత్త జనరేటర్ అమర్చడానికి సమయం పట్టింది, దీనివల్ల ఆట ముగింపు దాదాపు 30 నిమిషాలు వాయిదా పడింది. ఒడిశా క్రీడా శాఖ ఓసీఏ కి పంపిన లేఖలో, అంతరాయం కారణాలను వివరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సూచించింది.
ఇది కూడా చదవండి: IND vs ENG: రేపే మూడో వన్డే..! క్లీన్ స్వీప్ పై కన్నేసిన భారత్..!
IND vs ENG 2nd ODI: ఓసీఏ కార్యదర్శి సంజయ్ బెహెరా ఈ విషయమై విలేకరులతో మాట్లాడుతూ, స్టేడియం పునరుద్ధరణ గురించి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో చర్చలు జరిగినట్లు తెలిపారు. 10 రోజుల్లోగా ఫ్లడ్లైట్ల పని చేయకపోవడంపై సమాధానం ఇవ్వాలని ఓసీఏ నుంచి కోరిందని చెప్పారు.
ఆటగాళ్ల బస్సు ఫ్లడ్లైట్ టవర్ వద్ద ఆగి ఉండటంతో బ్యాకప్ జనరేటర్లు చేరుకోలేకపోయాయని, ఆ సమయంలో డ్రైవర్ లేడని, వాహనాన్ని తీయడానికి అతన్ని పిలిచామని చెప్పారు. తర్వాత జనరేటర్ టవర్ వద్దకు చేరుకుని విద్యుత్తు పునరుద్ధరించామని బెహెరా వివరించారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా స్టేడియంలో జరిగాయి.