Amit sha: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఈరోజు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందన
ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, “భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే దిశగా భద్రతా బలగాలు బీజాపూర్‌లో అతి పెద్ద విజయాన్ని సాధించాయి. ఈ ఆపరేషన్‌లో 31 మంది నక్సల్స్ మృతి చెందారు. భద్రతా బలగాలు భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి,” అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇద్దరు జవాన్లు వీరమరణం పొందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. “మానవ వ్యతిరేక నక్సలిజాన్ని రూపుమాపే క్రమంలో ధైర్యశీలులైన ఇద్దరు జవాన్లను కోల్పోయాం. దేశం వీరులను ఎప్పటికీ మరచిపోదు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను,” అని తెలిపారు.
2026 మార్చి 31నాటికి నక్సలిజానికి ముగింపు
నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని సమూలంగా అణచివేస్తామని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఇకపై ఏ భారతీయ పౌరుడు నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని హామీ ఇచ్చారు.
మృతి చెందిన వారిలో అగ్రనేతలు?
ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనికి సంబంధించిన కచ్చితమైన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

