Local Elections: స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీల పరిధిలో ఓటరు జాబితాలను సిద్ధం చేసింది. వార్డుల వారీగా విభజన చేయాలంటూ సిబ్బందికి ఆదేశాలను జారీ చేసింది. దీంతో పాటు మండల, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను చేపట్టింది. ఈ మేరకు ఆయా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ఉంచింది. దీంతో ఎప్పుడంటే అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం చేసింది.
అధికారులు, సిబ్బంది నియామకం
Local Elections: స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 10 మంది చొప్పున మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్, స్టేట్ రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేసింది. వీరందరికీ హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో శిక్షణ కూడా ఇచ్చింది. వారు త్వరలో జిల్లాలకు వెళ్లి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఈ నెల 10లోపు మండల, జిల్లా పరిషత్ పంచాయతీ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బంది ఎంపికను పూర్తిచేయాలని ఆదేశించింది.
Local Elections: ఎన్నికల నిర్వహణకు ఎంపిక చేసిన అధికారులకు ఫిబ్రవరి 12లోపు శిక్షణ పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది. అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు ఈ నెల 15లోపు శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 11న కలెక్టర్లతో ఈసీ భేటీ అయి ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించనున్నది.
సిద్ధమవుతన్న బ్యాలెట్ పేపర్లు
Local Elections: ఇప్పటికే జిల్లాల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణకు కలెక్టర్లు ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులను టెండర్లకు పిలిచారు. కొన్ని జిల్లాల్లో టెండర్లు పూర్తయి ప్రింటింగ్ సైతం పూర్తయినట్టు సమాచారం. దీంతో ఆ జిల్లాల్లో ప్రస్తుతం బ్యాలెట్ పేపర్లను పంచాయతీలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీల వారీగా బ్యాలెట్ పేపర్లకు సీరియల్ నంబర్లు వేస్తున్నట్టు సమాచారం.
రిజర్వేషన్ కోసం
Local Elections: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వేను పూర్తిచేసింది. ఇప్పటికే పంచాయతీల్లో ఓటరు జాబితాలను అతికించారు. పంచాయతీ సిబ్బంది వార్డులవారీగా ఓటరు జాబితాలను సేకరిస్తున్నారు. రిజర్వేషన్ ఆధారంగా కూడా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకావం ఉన్నది. ప్రధానంగా రిజర్వేషన్ ఆధారంగా వార్డులవారీగా జాబితా తయారు చేసి ఆ పంచాయతీని ఏ క్యాటగిరీకి రిజర్వ్ చేయాలనే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

