Janasena: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (2024) 100 శాతం సీట్లలో విజయం సాధించి, 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా రికార్డు సృష్టించిన జనసేన పార్టీకి మరో తీపికబురు అందింది. ఇప్పటికే రిజస్టర్డ్ పార్టీగా గుర్తింపును దక్కించుకొని ఏపీలో గాజు గ్లాసు గుర్తును పదిలం చేసుకున్నది. ఇప్పుడు తెలంగాణలో కూడా జనసేన పార్టీకి గుర్తింపు దక్కింది. స్థానిక ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తను ఎన్నికల సంఘం కేటాయించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని జనసేన పార్టీ నేతలు, శ్రేణుల్లో హర్షం వ్యకతమవుతున్నది.
Janasena: జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చామని, దానికి అనుగుణంగానే తెలంగాణలోనూ గుర్తించాలని, గాజు గ్లాస్ గుర్తును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆపార్టీ లీగల్ సెల్ చైర్మన్కు లేఖ రాశారు. ఈ మేరకు జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గుర్తిస్తూ ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Janasena: జనసేనకు గాజుగ్లాసు గుర్తును కేటాయించడంతో తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని జాగృతం చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పటివరకూ తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ కొంత అంటీముట్టనట్టుగానే ఉంటూ వస్తున్నది. ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఏపీ రాజకీయాలకే పూర్తిగా ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇక రెండు రాష్ట్రాల్లో క్రియాశీలకం కానున్నారు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో కూటమి కట్టే పనిలో భాగంగానే చకచకా శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దానిలో భాగంగానే అధికారిక చిహ్నం కోసం చేసిన ప్రయత్నాలు సఫలంకావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
