Singanamala: ఆ స్టార్ హీరోల సినిమాల వల్ల 100 కోట్లు లాస్.. ఒక్కసారి కూడా పట్టించుకోలే..

Singanamala: ఇటీవల కాలంలో సినిమాలు ఏళ్ల తరబడి చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ప్రారంభంలో అనుకున్న బడ్జెట్ ఒకటైతే, చివరికి సినిమా పూర్తయ్యే సరికి ఖర్చు పది రెట్లు పెరుగుతోంది. దీనివల్ల నిర్మాతలు తమ పెట్టుబడిపై లాభం వస్తుందా? రావా? అనే ఆందోళనలో ఉంటున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ వంటి చిత్రాలు విజయవంతమయ్యాయి కాబట్టి ఆ సినిమాల నిర్మాతలు సేఫ్ అనిపించుకున్నారు. కానీ అదే చిత్రాలు ఫ్లాప్ అయితే, టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని చెప్పొచ్చు.

ఇటీవలే విడుదల కాకముందే భారీ బడ్జెట్‌ వల్ల నిర్మాతను ఒత్తిడికి గురిచేసిన సినిమా ‘గేమ్ చేంజర్’. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న మరో నిర్మాత తాజాగా మీడియా ముందుకు వచ్చి, స్టార్ హీరోలతో సినిమాలు చేయడం వల్ల తనకు రూ. 100 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించారు. ఆ నిర్మాత మరెవరో కాదు… శింగనమల రమేష్ బాబు.

స్టార్ హీరోలతో చేసిన రెండు సినిమాలే నష్టానికి కారణం!

శింగనమల రమేష్ బాబు పేరు ప్రస్తుత తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో వరుసగా సినిమాలు ప్రకటించి వార్తల్లో నిలిచిన వ్యక్తి. అయితే, ఆయన నిర్మించిన రెండు భారీ బడ్జెట్‌ చిత్రాలు—పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమురం పులి’ మరియు మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’—బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి.

2010లో ఈ క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కిన ఈ సినిమాలు అనేక కారణాల వల్ల ఆలస్యమయ్యాయి. ఈ రెండు సినిమాల వల్ల తనకు దాదాపు రూ. 100 కోట్ల నష్టం వచ్చిందని రమేష్ బాబు మీడియా సమావేశంలో తెలిపారు. అప్పుడు తనను ఎవరూ పట్టించుకోలేదని, సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తాను ఒంటరైనట్లు అనిపించిందని ఆయన వాపోయారు.

జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన రమేష్ బాబు

ఇటీవల ఓ కేసులో 75 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి, కొద్ది రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలైన రమేష్ బాబు, తన భవిష్యత్‌ కార్యాచరణ గురించి వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జైలుకు వెళ్లడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా, ‘‘మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల భూమిని ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్మినట్లుగా, రూ. 14 కోట్ల మోసం చేశానని నాపై కేసు పెట్టారు. కానీ, న్యాయస్థానం విచారణ తర్వాత నన్ను నిర్దోషిగా తేల్చారని చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *