ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. రేపు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు. ఎల్లుండి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాలు అప్పగిస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది.
భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం ధరకు సంబంధించి అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజు కింద MRPలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు రౌండాఫ్ చేసింది. MRP ₹160.50గా ఉంటే దాన్ని ₹170కి పెంచేలా ఫీజు ఉంటుంది. ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ ధర ₹99కే నిర్ధారించడంతో రూ.100లో రూ.1 మినహాయించి విక్రయిస్తారని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో 3396 మద్యం దుకాణాలు ఉండగా.. సగటున ప్రతి మద్యం షాపునకు 25 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు జిల్లాలో అయితే 50 వరకూ వచ్చినట్లు తెలిసింది. దాఖలైన దరఖాస్తులను 12,13వ తేదీలలో ఎక్సైజ్ శాఖ పరిశీలించింది. అక్టోబర్ 14న తేదీన జిల్లాల వారీగా లాటరీ తీస్తారు. ఈ లాటరీ కూడా మాన్యువల్ పద్ధతిలో ఉంటుంది. ఇక డ్రాలో గెలిచిన వారు 24 గంటల్లోగా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం లాటరీలో గెలిచిన వారికి అక్టోబర్ 15న మద్యం దుకాణాలను అప్పగిస్తారు. అక్టోబర్ 16 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది.

