Chandrababu: ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం ఉండకూడదు

Chandrababu: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం చోటు చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు అందాల్సిన సేవలు యథావిధిగా అందాలని, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుంటూ ప్రభుత్వం పని చేయాలని ఆయన సూచించారు.

సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల నిర్వహణపై వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని పరిశీలించారు. పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్, ఎరువుల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో సేకరించిన సర్వే నివేదికల ఆధారంగా సమీక్షించారు.

ప్రజల ఫిర్యాదులపై సీఎం ఆగ్రహం

కొన్ని పథకాల అమలులో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, అసంతృప్తిపై సమగ్రంగా విచారణ జరిపి, పనితీరును మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. పింఛను ఇంటి వద్ద అందకపోవడం, దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్‌ డెలివరీ సమస్యలు, ఆసుపత్రుల్లో సేవలపై అసంతృప్తి వంటి అంశాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా, సదరు లబ్ధిదారుల వద్దకు వెళ్లి సమస్యల అసలు కారణాలను విశ్లేషించాలని, వ్యక్తుల వల్ల గానీ, వ్యవస్థలో లోపాల వల్ల గానీ సమస్యలు తలెత్తితే తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

అవినీతికి తావివ్వొద్దు – సీఎం హెచ్చరిక

ప్రభుత్వ పథకాల అమలులో పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని, అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతి విషయంలో మాత్రం ఏమాత్రం సహించబోమని చంద్రబాబు హెచ్చరించారు. గ్యాస్ పంపిణీ విషయంలో అవినీతి జరిగితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులను చేయాలని స్పష్టం చేశారు.

సర్కారు పథకాలు ప్రజలకు పారదర్శకంగా, సమర్థంగా అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల నమ్మకాన్ని చూరగొనే విధంగా పని చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు తుదిశాఖసూచనలు చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *