Naga Babu: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమల గ్రామంలో జరిగిన ‘జనంలోకి జనసేన’ భారీ బహిరంగ సభకు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, “ఇక్కడ అందరూ పెద్దిరెడ్డికి భయపడతారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని కొందరు నన్ను హెచ్చరించారు. అయితే, నేను భయపడేది కాదు. పెద్దిరెడ్డి కాదు, ఇంకెవరు వచ్చినా భయపడే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.
పెద్దిరెడ్డికే కాదు, జగన్‌కు కూడా భయపడలేదు
“మేం న్యాయంగా, ధర్మంగా ముందుకు వెళ్లే పవన్ కల్యాణ్ నాయకత్వంలో పనిచేస్తున్నాం. పెద్దిరెడ్డికే కాదు, జగన్‌కు, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డికీ కూడా భయపడలేదు. మాకు భయం అనేది తెలియదు. ఎవరైనా రెడ్డే అయినా, ఇంకెవరైనా వచ్చినా భయపడేదే లేదు” అని నాగబాబు ధీమాగా పేర్కొన్నారు.
పెద్దిరెడ్డి భూ దోపిడీ – ఫైళ్ల దహనం
పెద్దిరెడ్డి భూ దోపిడీలో పాల్పడ్డారని, తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు ఉన్న ఫైళ్లను కాల్చివేయించారని నాగబాబు ఆరోపించారు. తగలబడిన ఫైళ్లలో ఎక్కువగా 22ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన పత్రాలే ఉన్నాయని, ఈ విషయాన్ని సీఐడీ అధికారులు కూడా నిర్ధారించారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.
వైసీపీ నేతల ధైర్యహీనత – అసెంబ్లీకి రాలేని పరిస్థితి
శాసనసభకు రాలేకపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలను నాగబాబు తీవ్రంగా విమర్శించారు. “మీరు ప్రజల ఓట్లతో గెలిచి కూడా అసెంబ్లీలో ప్రజల తరఫున గొంతు వినిపించలేకపోతున్నారు. జగన్‌తో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, శాసనసభలో మీరు లేనట్టే. మైక్ ఇవ్వడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు, సభకు వస్తే కదా మైక్ ఇస్తారు లేకపోతే తెలుస్తుంది” అని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది
వృద్ధులు, వితంతువుల పెన్షన్ రూ.1000 పెంచి రూ.4000 చేయడం, దివ్యాంగులకు రెట్టింపు పెన్షన్ అందించడం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. జగన్ ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో కేవలం రూ.250 పెంచినదే తప్ప, మరే హామీ అమలు చేయలేదని విమర్శించారు.
అభివృద్ధి చర్యలు
అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి రూ.12 వేల కోట్లు కేంద్ర నిధులు సంపాదించామని వివరించారు.
‘దీపం’ పథకం ద్వారా 80 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా దారుణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.361 కోట్లు కేటాయించామని వెల్లడించారు.గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడం, అత్యవసర వైద్యం కోసం ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఉద్యోగ నియామకాలు – పారిశ్రామిక పెట్టుబడులు
మెగా DSC ద్వారా 16,347 టీచర్ పోస్టులు, 6,000 పోలీసు ఉద్యోగాల నియామకాలకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రాకతో 20 ప్రముఖ కంపెనీలు రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, వీటి ద్వారా 4 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా 10 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని వెల్లడించారు.
రైతులకు న్యాయం – మహిళా అభివృద్ధి
ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు.డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు.
వైసీపీ పాలనలో ప్రజలకు నష్టం
“వైసీపీ సర్కార్ ప్రజలకు ఒరిగేదేమీ చేయలేదు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో 217, 144 రద్దు చేశాం. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రజల కోసం పనిచేసే కూటమి ప్రభుత్వం దాన్ని కొనసాగించేందుకుకృషి చేస్తోంది” అని నాగబాబు పేర్కొన్నారు.