CBI: దేశవ్యాప్తంగా 20 విద్యాసంస్థల్లో ఏకకాలంలో నిన్నటి నుంచి ఈరోజు వరకు సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు కేఎల్ వర్సిటీలో మెరుపుదాడులు చేసింది. ఈ మేరకు ఆ వర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా 14 మందిపై కేసులు నమోదుకాగా, వారిలో 10 మంది అరెస్టు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
CBI: నాక్ రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలపై ఏకకాలంలో 20 చోట్ల సీబీఐ ఈ దాడులకు దిగినట్టు తెలుస్తున్నది. ఈ తనిఖీల కోసం 15 సీబీఐ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. న్యాక్ ఇన్స్పెక్షన్ టీం చైర్మన్ సమరేంద్ర సహా నాక్ మాజీ డిప్యూటీ అడ్వైజర్ మంజునాథరావు, నాక్ అడ్వైజర్ శాంసుందర్, డైరెక్టర్ హనుమంతప్ప, వర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ తదితరులను అరెస్టు చేసినట్టు తెలిసింది.
CBI: ఈ సందర్భంగా నిందితుల నుంచి నగదు, కంప్యూటర్ పరికరాలను సీబీఐ తనిఖీల బృందాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. రూ.37 లక్షల నగదు, కంప్యూటర్, ల్యాప్టాప్లు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. లక్షలాది రూపాయల మేర ముడుపులు స్వీకరించినట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు 20 చోట్ల ఈ దాడులు జరిగాయి.
CBI: గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ (కేఎల్యూ)లో సీబీఐ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. మెరుగైన నాక్ రేటింగ్ కోసం లక్షల రూపాయలను ఇచ్చినట్టు ఫిర్యాదులు రావడంతో ఈ వర్సిటీల్లోనూ తనిఖీలకు వచ్చినట్టు తెలిసింది. గుంటూరుతోపాటు చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలాము, సంబాల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధనగర్, న్యూఢిల్లీ తదితర 20 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఈ సోదాలు జరిపారు.

