Great Escape from Jail: జైలులో ఒక ఖైదీ. ఆ ఖైదీకి కాలుకి దెబ్బతగిలింది. పాపం జైలర్ వెంటనే ఇద్దరు గార్డులను ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం పంపించాడు. ఆ తరువాత గార్డులు జైలుకు చేరుకున్నారు కానీ.. ఖైదీ కనిపించలేదు. దీంతో జైలు అధికారులకు తిప్పలు మొదలయ్యాయి. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ సినిమా స్టోరీని తలపించే గ్రేట్ ఎస్కెప్ స్టోరీ తెలుసుకోవాల్సిందే.
ఖైదీ చేసిన నేరం ఇదే..
డిసెంబర్ 25న ఎంపీ ఉజ్జయిని జిల్లా నక్డా నగర్‌లోని శివబాబా మద్యం కంపెనీలో ఐదుగురు సాయుధులు దోపిడి చేసి 18 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు.ఈ ఘటనలో రోహిత్ శర్మ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి 5వ తేదీన కచ్రోడ్ జైలులో ఉంచారు.
పాపం దెబ్బతగిలింది..
ఒకరోజు అంటే జనవరి 28న ఉదయం ఖైదీ రోహిత్ శర్మకు కాలికి గాయం అయిందని జైలు అధికారులకు చెప్పాడు. దీంతో 11 గంటల సమయంలో రోహిత్ శర్మ ను జైలు గార్డులు రాజేష్ శ్రీవాస్తవ, నితిన్ తలోడియాలను ఎస్కార్ట్ గా ఇచ్చి కచ్రోట్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గార్డులు వచ్చారు..
సాయంత్రం 6 అయింది. గార్డులు వచ్చారు. కానీ, ఖైదీ వెనక్కి రాలేదు. దీంతో అధికారులు గార్డులను నిలదీశారు. ఖైదీ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. దీనికి ఇద్దరు గార్డులు తలాతోకా లేని సమాధానాలు చెప్పడం మొదలు పెట్టారు. ఒకడు నన్ను కొట్టి పారిపోయాడంటాడు. ఇంకొకడు టిఫిన్ తింటుంటే మస్కా కొట్టి వెళ్లిపోయాడని చెబుతాడు. అసలు పొంతన లేకుండా ఇద్దరి సమాధానాలు ఉండడంతో.. జైలు అధికారులు హాస్పిటల్ సీసీ కెమెరా నుంచి మొదలు పెట్టి వరుసగా చెక్ చేసుకుంటూ వచ్చారు.
మసాజ్ పార్లర్ లో హాయ్.. హాయ్..
సీసీ ఫుటేజ్ లో హాస్పటల్ నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు ముగ్గురూ బయటకు రావడం రికార్డ్ అయింది. ఆ తరువాత ఖైదీ రోహిత్ శర్మను జైలుకు తీసుకురాకుండా.. అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో పట్టణ శివార్లలో ఉన్న మసాజ్ సెంటర్ కి తీసుకు వెళ్లారు. అక్కడ ముగ్గురూ మసాజ్ చేయించుకున్నారు. రాజేష్ శ్రీవాస్తవ, నితిన్ తలోడియాలు మసాజ్ మత్తులో ఉండగా ఖైదీ రోహిత్ శర్మ అక్కడ నుంచి పారిపోయాడు.
దీంతో ఏమి చేయాలో తోచని గార్డులు జైలు వద్దకు చేరుకొని కాకమ్మ కథలు చెప్పడం మొదలు పెట్టారు. చివరకు విచారణలో మసాజ్ మస్కా అర్ధం అయింది. దీంతో జైలు అధికారులు అవాక్కయ్యారు. ఇంతకీ ట్విస్ట్ ఏమిటంటే.. వాళ్ళిద్దరినీ మస్కా కొట్టి మసాజ్ సెంటర్ నుంచి ఖైదీ తప్పించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం.
సస్పెన్షన్.. వెతుకులాట..
ఈ సంఘటన నేపథ్యంలో జైలు గార్డులు రాజేష్ శ్రీవాస్తవ, నితిన్ తలోడియాలను సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న రోహిత్ శర్మను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Donald Trump: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక.. డాలర్‌తో వ్యాపారం చేయకపోతే..100 శాతం సుంకాన్ని ఎదుర్కోవలసిందే
