Hyderabad: హైదరాబాద్‌లోని గోషామహల్‌లో నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ ఆస్పత్రి రూ.2,700 కోట్ల వ్యయంతో 26.30 ఎకరాల విస్తీర్ణంలో, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. మొత్తం 8 బ్లాకులు, 14 అంతస్తులతో కూడిన ఈ ఆస్పత్రి 2,000 పడకల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్టాఫ్ మెడికల్ విద్యార్థుల కోసం ప్రత్యేక భవనాలు కూడా నిర్మించబడతాయి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
అయితే, గోషామహల్ స్టేడియంలో ఆస్పత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అసుపత్రి నిర్మాణానికి గోషామహల్ స్టేడియం కాకుండా ఇంకెక్కడైనా నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి విభాగానికి ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, ఆధునిక డయాగ్నస్టిక్ సేవలు, మార్చురీ, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లు వంటి సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు.
అంతేకాక, అండర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్లలో పార్కింగ్, ఆస్పత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆస్పత్రి చుట్టూ విశాలమైన రహదారులు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, రోగుల సహాయకుల కోసం డార్మెటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.