YS sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తూ, అంబేద్కర్‌ను హేళన చేస్తున్నారని, మహాత్మ గాంధీని విలన్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
ఆమె మాట్లాడుతూ, ఏడు దశాబ్దాల క్రితం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, ఈ రాజ్యాంగం మనకు స్వయం పాలనను, హక్కులను అందించిందని గుర్తుచేశారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశానిదని, ఈ సమైక్యతకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ఆధారం అని ఆమె చెప్పారు.
షర్మిల బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ, గాడ్సేకు గుడులు కడుతూ, మతం, కులం పేరుతో కలహాలు రేపుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశ సంపదను కొందరు తన సన్నిహితులకు దోచిపెడుతున్నారని, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
అంతేకాక, బీజేపీకి తాము మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ, వైసీపీలు ఆచరణలో చూపుతున్నాయని, విభజన హామీలను అమలు చేయకపోయినా బీజేపీతో పొత్తులు పెట్టుకుంటున్నాయని షర్మిల ఆరోపించారు. చంద్రబాబుది తెరముందు పొత్తు అయితే, జగన్‌ది తెరవెనుక పొత్తు అని ఎద్దేవా చేశారు.
షర్మిల జగన్‌పై కూడా విమర్శలు గుప్పించారు. జగన్ బీజేపీకి గులామిగా మారారని, వైఎస్ఆర్ ఆశయాలను విస్మరించారని అన్నారు. దళితుల ఓట్లతో గెలిచిన వైసీపీ, దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అంబేద్కర్‌కు అవమానం జరుగుతున్నా వైసీపీ నేతలు నోరుమెదపరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం పొంచి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం ఉన్నదని, మతాల మధ్య చిచ్చు పెట్టే విధానాలు అవలంబిస్తున్నారని ఆమె అన్నారు. ఈ దేశానికి మేలు చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆమె స్పష్టంచేశారు.
