Constable: వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘కానిస్టేబుల్’. బలగం జగదీశ్ దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ సందేశ్ కు జోడీగా మధులిక వారణాసి నటిస్తోంది. “కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న’’ అంటూ సాగే టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ విడుదల చేశారు. ఈ పాటకు శ్రీనివాస్ తేజ సాహిత్యాన్ని అందించగా సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు. నల్గొండ గద్దర్ నర్సన్న దీనిని ఆలపించారు. ఈ పాట తనకెంతో నచ్చిందని, కానిస్టేబుల్స్ మీద ఈ పాట చాలా బాగా రాశారని సి.పి. ఆనంద్ అన్నారు. ఇది తనకు మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందనే ఆశాభావాన్ని వరుణ్ సందేశ్ వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండీ కానిస్టేబుల్ అవ్వాలనుకునే వాడినని, ఆ కోరిక నెరవేరకపోవడంతో ఇలా సినిమా తీశానని నిర్మాత బలగం జగదీశ్ అన్నారు. మంచి కథ, కథనాలతో రాబోతున్న ఈ చిత్రంలోని కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ చక్కగా ఒదిగిపోయారని దర్శకుడు ఆర్యన్ సుభాన్ చెప్పారు.