Kishan reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దావోస్ పర్యటన రాష్ట్రానికి లాభం చేకూరిస్తే ఎవరూ విమర్శలు చేయరని, అందరికీ అది గర్వకారణమే అవుతుందని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులను మాత్రమే తీసుకెళ్లి అక్కడ ఒప్పందాలు చేసుకోవడం ఏమాత్రం సమంజసమని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ, విదేశాల నుంచి పెట్టుబడులు రాష్ట్రానికి రావాలని అందరూ కోరుకుంటున్నారని, అయితే ఈ ఒప్పందాలు కేవలం కాగితాల మీదే ఆగిపోవద్దని సూచించారు. తెలంగాణలో పారిశ్రామికవేత్తల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, రాష్ట్ర ప్రభుత్వం వారిని వేధిస్తున్నట్లు ఆరోపించారు.
పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని, కొందరు రియల్ ఎస్టేట్ రంగం నుంచి తప్పుకుంటామని చెబుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం పక్షపాతం చూపితే, ప్రస్తుత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు సమకూరే విధంగా పారదర్శకత అవసరమని కిషన్ రెడ్డి హితవు పలికారు.