Pushpa 2: ఇవాళ సినిమాల వీకెండ్ కలెక్షన్స్ ను మాత్రమే అభిమానులు పట్టించుకుంటున్నారు. మొదటి వారంలో వచ్చే వసూళ్ళతోనే సినిమా జయాపజయాలు నిర్థారణ అవుతున్నాయి. మూడోవారం గడిచే సరికీ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమౌతోంది. దాంతో యాభై రోజులు, వంద రోజులు అనే మాటే వినిపించడం లేదు. ఇటీవల వచ్చిన ‘పుష్ప-2’ సినిమా మాత్రం అందుకు మినహాయింపు అనే చెప్పాలి. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా జనవరి 23తో యాభై రోజులు పూర్తి చేసుకుంది. అయితే స్ట్రయిట్ అండ్ షిఫ్టింగ్ తో దేశ వ్యాప్తంగా ఈ సినిమా 300కు పైగా థియేటర్లలో యాభై రోజులు ప్రదర్శితమైందని తెలుస్తోంది. గత యేడాది కలెక్షన్స్ పరంగానూ 1800 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి ‘పుష్ప -2’ నేషనల్ వైడ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అయితే… ఇంత భారీ స్థాయిలో విజయం సాధించిన ఈ సినిమాకు సంబంధించిన మూడో భాగం మాత్రం ఇప్పట్లో రాదని దానికి మరో ఐదేళ్ళు పడుతుందని ఇండస్ట్రీ వర్గాల మాట!
