తొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి

ENG vs PAK 1st Test: సొంత గడ్డపై పాకిస్థాన్ జట్టుకు మరో టెస్టు ఓటమి ఎదురైంది. ఇంగ్లండ్‌తో ముల్తాన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ ఇన్నింగ్స్‌ 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 500కి పైగా పరుగులు చేసిన జట్టు ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోవడం టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో 147 ఏళ్ల టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును పాక్‌ తన ఖాతాలో వేసుకుంది. ఇరు జట్లూ తమ తొలి ఇన్నింగ్స్‌ల్లో 550+ కొట్టిన సందర్భంలో ఫలితం వచ్చిన రెండో మ్యాచ్‌ కూడా ఇదే.

ఇంగ్లండ్‌తోనే 2022లో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌ 74 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా, ఓవర్‌నైట్‌ స్కోరు 152/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన పాక్‌ మరో 68 పరుగులు మాత్రమే జోడించింది. ఇంగ్లండ్‌ బౌలర్ల దెబ్బకు 220కే రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. అఘా సల్మాన్(63), ఆమీర్ జమాల్ (55 నాటౌట్) హాఫ్ సెంచరీలు సాధించినా, తమ జట్టును ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి మాత్రం గట్టెక్కించలేకపోయారు. చివరి బ్యాటర్ అబ్రార్ అహ్మద్‌ జ్వరం కారణంగా మైదానంలోకి దిగలేదు. దీంతో పాక్‌ ఆలౌటైనట్లు అంపైర్లు ప్రకటించారు.

ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 4, గస్ అట్కిన్సన్ 2, కార్సె 2, క్రిస్ వోక్స్ ఓ వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 556/10 స్కోరు చేయగా.. ఇంగ్లండ్ 823/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ సెంచరీ సాధించిన హ్యారీ బ్రూక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు. జో రూట్‌(262) డబుల్‌ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *