Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఘటన

Hyderabad: బంగారు బిస్కెట్లు ఉన్నాయంటూ నమ్మించి తక్కువ ధరకు అమ్ముతానంటూ బురిడీ కొట్టించేందుకు యత్నించిన మోసగాడిని ఓ వ్యాపారి అత్యంత చాకచక్యంగా పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిని రిమాండ్‌కు తరలించారు.

టోలీచౌకీ సమీపంలోని అరవింద్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న వ్యాపారి అబ్దుల్లా ఇబ్రహీంకు ఈ నెల 6న రాజస్థాన్‌కు చెందిన ఇనాముల్‌ హసన్ అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. తన వద్ద 8 కేజీల బంగారం ఉందని, దాన్ని కేవలం రూ.2 కోట్లకే అమ్ముతానంటూ చెప్పాడు. తన వద్ద అంత డబ్బు లేదని, తనకు ఫోన్‌ చేయొద్దని వ్యాపారి సమాధానం ఇచ్చాడు. అయినా సరే వినకుండా పలుమార్లు ఇనాముల్‌ హసన్‌ ఫోన్‌ చేస్తుండటంతో సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదే క్రమంలో గురువారం రాత్రి మరోసారి ఇనాముల్‌ హసన్‌ వ్యాపారికి ఫోన్‌ చేశాడు. తాను హైదరాబాద్‌కు వచ్చానని, తన వద్ద ఒక కేజీ బంగారు కడ్డీలు ఉన్నాయని చెప్పాడు. దీంతో అతడిని ఎలాగైనా పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకున్న అబ్దుల్లా ఇబ్రహీం, అతడితో బేరం చేయసాగాడు. నాణ్యత పరీక్ష చేసిన తర్వాతనే కొంటానంటూ మెలికపెట్టాడు. దీంతో గురువారం రాత్రి రెండు బంగారం బిస్కెట్లు తీసుకువచ్చిన ఇనాముల్‌ హసన్‌ వాటిని పరీక్షించుకోవాలని చెప్పాడు.

ముందుగా తనకు రూ.15 లక్షలు చూపించాలని, నాణ్యత పరీక్ష చేసిన తర్వాత రూ.15 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో కొంత డబ్బును సైతం తనతో పాటు తీసుకువచ్చిన అబ్దుల్లా తన ఆఫీసులో సీసీ కెమెరాలు ఉంటాయని, ఇంటికి వెళ్లిన తర్వాత చెక్‌ చేసుకుని బంగారం బిస్కెట్లు కొంటానంటూ కారులో ఎక్కించుకున్నాడు. అతడిని కారులో ఎక్కుంచుకుని నేరుగా ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించడంతో ఇనాముల్‌ హసన్‌ కంగుతిన్నాడు.

అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించగా, అప్పటికే అక్కడున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న బిస్కెట్లు తీసుకొని పరీక్షించగా బిస్కెట్లు నకిలీవని, బంగారం బిస్కెట్ల పేరుతో అందిన కాడికి దోచుకుని ఉడాయించే క్రమంలో గురువారం ఉదయమే ఇనాముల్‌ హసన్‌ రాజస్థాన్‌ నుంచి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై బీఎన్‌ఎస్‌ 318 (4), రెడ్విత్‌ 62 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఫిలింనగర్‌ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Aghori Final Rituals: అఘోరీల అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు? వాళ్ళు శవాలను పాతిపెట్టరు, కాల్చరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *