Terrorist attack: ఖలిస్తాని ఉగ్రవాది, నిషేధిత ‘‘సిఖ్స్ ఫర్ జస్టిస్’’ (SFJ) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ, మరోసారి భారత్‌ను బెదిరించాడు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే ‘‘మహా కుంభమేళా’’పై దాడులు నిర్వహించి భగ్నం చేస్తామంటూ పన్నూ వీడియో ద్వారా హెచ్చరికలు జారీ చేశాడు.
వీడియోలో పన్నూ, హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించడానికి మరియు హిందుత్వాన్ని నాశనం చేయడానికి ‘‘ప్రయాగ్‌రాజ్ ఛలో’’ అనే పిలుపునిచ్చాడు. లక్నో, ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్‌లలో ఖలిస్తానీ మరియు కాశ్మీరీ జెండాలు ఎగరవేయాలని తన మద్దతుదారులకు సూచించాడు. ‘‘మహా కుంభమేళా 2025 యుద్ధభూమిగా మారుతుంది’’ అని కూడా అతను ప్రకటించాడు.
ఇంతకు ముందు పన్నూ విడుదల చేసిన వీడియోలో, మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 29), బసంత్ పంచమి (ఫిబ్రవరి 3) రోజుల్లో జరిగే ముఖ్యమైన మతపరమైన స్నానాలను దెబ్బతీస్తామని హెచ్చరించాడు.
అఖిల భారతీయ అఖాడా పరిషత్ స్పందన:
పన్నూ చేసిన బెదిరింపులను అఖిల భారతీయ అఖాడా పరిషత్ తీవ్రంగా ఖండించింది. పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపూరి, పన్నూ వ్యాఖ్యలను పిచ్చివాడి మాటలుగా నిరసించారు. ‘‘పన్నూ అనే వ్యక్తి మహా కుంభమేళాలోకి రావడానికి ప్రయత్నిస్తే, అతడిని వెంటనే బయటకు పంపుతారు. ఇలాంటి పిచ్చివాళ్లను ఎన్నోసారి చూశాం’’ అని ఆయన స్పష్టంగా చెప్పారు.