Israel War: లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో హిజ్బుల్లా కాల్పుల విరమణను డిమాండ్ చేసింది. CNN రిపోర్ట్ ప్రకారం, ఈ సంస్థ మొదటిసారిగా కాల్పుల విరమణకు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. దీనికి గాజాలో యుద్ధాన్ని ఆపడం లేదా ఎటువంటి షరతులు విధించలేదు.
హమాస్‌కు మద్దతుగా హిజ్బుల్లా గత ఏడాది అక్టోబర్ 8న ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులు చేసింది. ఈ ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసిం మంగళవారం ప్రసంగించారు. కాల్పుల విరమణ కోసం లెబనీస్ పార్లమెంట్ స్పీకర్ నబీహ్ బెర్రీ చేస్తున్న ప్రయత్నాలకు హిజ్బుల్లా మద్దతు ఇస్తుందని ఖాసిమ్ చెప్పారు.
కాల్పుల విరమణ కుదిరిన తర్వాత ఇతర విషయాలపై చర్చిస్తామన్నారు. గాజాలో కాల్పుల విరమణ కుదిరినప్పుడే ఇజ్రాయెల్‌పై దాడులను ఆపుతామని హిజ్బుల్లా గతంలో చెప్పింది. అయితే, ఇప్పుడు అటువంటి షరతులు ఏమీ లేకుండా కాల్పుల విరమణకు మద్దతు ఇస్తుండడం గమనార్హం. ఇది లెబనాన్ పై ఇజ్రాయేల్ దాడులను నిలువరించడానికి దోహదపడవచ్చని భావిస్తున్నారు.