Loans Apps:అప్పు చేయకండి.. తప్పు చేయకండి.. అన్నది పెద్దల నానుడి. కానీ ప్రజల ఆర్థికావసరాలు, తక్కువ ఆదాయాలతో అప్పు మస్ట్ అనేకాడికి వచ్చింది. అలాంటి అప్పులబారిన పడి ఎందరో వడ్డీలకు వడ్డీలు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు. ఇటీవల ఆన్‌లైన్ అప్పుల కారణంగా తమ ప్రాణాలనే బలితీసుకుంటున్నారు. ఆ ఆన్‌లైన్ అప్పులు ఇచ్చే వ్యాపారులు.. అప్పు తీసుకున్న వారి పరువును బజారుకీడ్చే పనులు చేస్తుండటంతో బంధువులు, మిత్రులు, గ్రామస్థుల మధ్య బతకలేక ఎందరో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
Loans Apps:ఇలాంటి ఆన్‌లైన్ అప్పులు ఇచ్చే వ్యాపారాలకు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. వారికి కఠిన శిక్షలు అమలు చేసేందుకే నిర్ణయించింది. ఈ మేరకు ఒక కొత్త చట్టం రూపకల్పనలో పడింది. ఇప్పటికే ముసాయిదాను రూపొందించింది. లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నది.
Loans Apps:ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చే వారికి 10 ఏండ్ల వరకు కఠిన శిక్షలు అమలు చేయాలని ఆ ముసాయిదాలో ఇప్పటికే రూపొందించింది. చట్టబద్ధత లేకుంటే.. భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.కోటి జరిమానా విధించేలా కేంద్ర ప్రభుత్వం ముసాయిదాలో చట్టం రూపకల్పన చేసింది. ఈ చట్టం అమలులోకి వస్తే మాత్రం బంధువులకు ఇచ్చే రుణాలు మినహా వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్‌లు అప్పులు ఇవ్వడం కుదరకపోవచ్చు.

