Spy Camera: నోయిడాలోని ఓ స్కూల్‌లోని మహిళా టీచర్ టాయిలెట్‌లో స్పై కెమెరా పెట్టడంతో స్కూల్ డైరెక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఉపాధ్యాయుల వాష్‌రూమ్‌లోని బల్బ్ సాకెట్‌లో స్పై కెమెరాను ఉంచినట్లు చెబుతున్నారు. అతను తన కంప్యూటర్, మొబైల్ ద్వారా వాష్‌రూమ్ వీడియోను ప్రత్యక్షంగా చూస్తున్నాడు. దీనిపై ఓ టీచర్ పోలీసులకు సమాచారం అందించారు.
నోయిడాలోని సెక్టార్ 70లోని లెర్న్ విత్ ఫన్ అనే ప్లే స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 10న, వాష్‌రూమ్‌లోని బల్బ్ హోల్డర్‌లో అసాధారణంగా ఏదో ఉన్నట్టు ఒక టీచర్ గమనించారు. హోల్డర్‌లో మసక వెలుతురు కనిపించింది. అనుమానాలకు తావిచ్చింది. నిశితంగా పరిశీలిస్తే స్పై కెమెరా ఉన్నట్లు తెలిసింది. వెంటనే పాఠశాల భద్రతా సిబ్బందికి సమాచారం అందించగా వారు పరికరం ఉన్నట్లు నిర్ధారించారు.
Spy Camera: టీచర్ ఈ విషయాన్ని స్కూల్ డైరెక్టర్ నవనీష్ సహాయ్, స్కూల్ కోఆర్డినేటర్ పరుల్‌కు రిపోర్ట్ చేశారు. అయితే, ఆరోపణలను వారు ఖండించారు. సమస్య పరిష్కారానికి సహాయ్ గానీ, పారుల్ గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయురాలు ఆరోపించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు నోయిడా సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) శక్తి మోహన్ అవస్తీ విచారణ ప్రారంభించి కేసు నమోదు చేశారు. రికార్డింగ్ లేకుండా ప్రత్యక్ష ప్రసారం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న కెమెరాను అక్కడ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ నవీష్ సహాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Spy Camera: 22,000 రూపాయలకు ఆన్‌లైన్‌లో స్పై కెమెరాను కొనుగోలు చేసినట్లు విచారణలో సహాయ్ అంగీకరించాడు. పరికరం ప్రత్యేకంగా బల్బ్ హోల్డర్ లోపల దాచడానికి వీలుగా రూపొందినట్లు నిర్ధారించారు. ఇది సాధారణంగా ఎవరి కళ్లకు కనిపించదని పోలీసులు చెప్పారు.
పాఠశాలలోని టాయిలెట్‌లో ఇలాంటి స్పై కెమెరా కనిపించడం ఇదే మొదటిసారి కాదని టీచర్ తెలిపారు. పారుల్‌కు అప్పగించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

