Mahaa Vamsi Comment: ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అని ఒక సామెత ఉంది. అంటే ఆవే చేలో పడి దొరికినకాడికి తినేస్తూ ఉంటే.. దూడ మాత్రం గట్టున ఉన్న గడ్డి మేస్తూ ఊరుకుంటుందా? తల్లిని అనుసరించి చేలో పడి చెలరేగిపోతుంది. సరిగ్గా ఇది వైసీపీ ప్రభుత్వ పాలనకు అన్వయిస్తుంది. ఎందుకంటే, పైస్థాయిలో ప్రజల సొమ్ముకు కాపు కాయాల్సిన నేతలు అందినకాడికి దోచుకోవడం.. దోచుకోవడానికి దారులు వెతుక్కోవడం.. దానికోసం తమ నియంత్రణలో అధికారులను పెట్టుకోవడం చేశారు. దీంతో ఆ అధికారులు కూడా అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ ఆస్తులు పెంచుకోవడం చేశారు. తీగలాగితే డొంక కదలడం సహజం.. కానీ, ఆంధ్రప్రదేశ్ లో పీడీఎస్ రైస్ అక్రమాల చిట్టా తీగను పట్టుకుంటే.. అది మాఫియా.. పోర్టు మీదుగా చివరికి అప్పట్లో అధికార యంత్రాంగం చుట్టూ తిరుగుతూ మరెక్కడికో పోతోంది.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టువదలకుండా పీడీఎస్ రైస్ అక్రమ దందాలపై దండయాత్ర మొదలు పెట్టారు. దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోడయ్యారు. ఇంకేముంది.. ఒక్కటొక్కటిగా పేదల బియ్యంతో అప్పటి పెద్దలు గద్దలుగా మారి చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రైస్ మాఫియా వ్యవహారంలో సౌతిండియాలోనే నెంబర్ వన్ రైస్ బ్రాండ్ గా చెప్పుకునే శ్రీలలితా లింకులు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇది కూడా చదవండి: Gold Price Today: కాస్త పెరిగిన బంగారం ధర.. వెండి లక్ష దగ్గరే!
లలితా ఇండస్ట్రీస్ కు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయాలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. లలితా ఇండస్ట్రీస్ మనీ లాండరింగ్ చేసింది అనే విషయం అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున డబ్బును ఎన్నికల ముందు విత్ డ్రా చేసి దానిని అప్పటి ప్రభుత్వ పెద్దల వద్దకు చేర్చారానే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఐదేళ్ళలో లలితా ఇండస్ట్రీస్ అధినేతలు మట్టే ప్రసాద్ బాబు సోదరులు తమ పేర్లతో అయితేనేమి, ఇతరుల పేరుతో అలాగే కంపెనీల పేరుతో 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఐటీ డిపార్ట్మెంట్ గుర్తించింది. ప్రభుత్వానికి టాక్స్ ఎగ్గొట్టి అక్రమ పద్ధతుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ భూమిని కొనుగోలు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఇక లలితా ఇండస్ట్రీస్, మాజీ సీఎస్ జవహర్ రెడ్డితో కలిసి విజయనగరం జిల్లాలో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు అసలు ఈ మాట్టే బ్రదర్స్ కూ, జవహర్ రెడ్డికి మధ్య సంబంధాలు ఏమిటి అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మొత్తంగా చూసుకుంటే, ప్రస్తుతం బయటపడ్డ కంపెనీ ఒక్క లలితా ఇండస్ట్రీస్ మాత్రమే. కానీ, లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని కంపెనీల బండారం బయటపడే అవకాశం ఉంది. ఈ కంపెనీలన్నీ అధికారుల అండదండలతో.. అప్పటి అధికార పక్షానికి డబ్బును సప్లై చేసే కంపెనీలుగా పనిచేశాయనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది. ఈ వ్యవహారాలు బయట పడుతుంటే.. అవినీతికి కొత్త రూట్స్ కనిపెట్టిన వైసీపీ ప్రభుత్వ నిర్వాకం పట్ల ప్రజలు నివ్వెరపోయారు!


