హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయగా తాజాగా అందుకు సంబంధించిన గెజిట్ విడుదలైంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రహదారులు, నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు, పార్క్‌ల రక్షణ కోసం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.
అయితే చట్టబద్ధత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. చట్టబద్దత లేదని గగ్గోలు చేసిన ప్రతిపక్షాల నోరు మూయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గేదెలే అనే రీతిలో హైడ్రా చట్టబద్దత దిశగా ముందడుగు వేసిందని చెప్పవచ్చు.