KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ త్వరలో అమెరికా వెళ్లనున్నట్టు సమాచారం. అధికారికంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన వెలువడకున్నా ఆయన త్వరలో వెళ్తారని విశ్వసనీయ సమాచారం. అక్కడే కనీసం రెండు నెలలపాటు ఉంటారని, విశ్రాంతి తీసుకుంటారని తెలిసింది. ఈ మేరకు అమెరికా నుంచి తిరిగి వచ్చాక కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో మళ్లీ భాగస్వాములు అవుతారని పార్టీ వర్గాల సమాచారం.
KCR: ఇదిలా ఉంటే సుధీర్ఘ రాజకీయ నేపథ్యమున్న కేసీఆర్ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. 10 ఏండ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా, 35 ఏండ్లపాటు రాజకీయ నేతగా కొనసాగిన కేసీఆర్.. ఏనాడూ ఆ దేశానికి వెళ్లలేదు. కేవలం రెండు దేశాలకు వెళ్లి వచ్చారు. అది ఒకటి సింగపూర్, రెండోది చైనా. అధికారికంగానే ఆ విదేశీ పర్యటనలు చేసి వచ్చారు. అంతకు మించి ఆయన తన జీవితకాలంలో దేశం విడిచి వెళ్లలేదు.
KCR: కేసీఆర్ మనుమడు, కేటీఆర్ తనయుడైన హిమాన్షు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో హిమాన్షు ఇటీవల స్వదేశానికి వచ్చిన సమయంలో తాత కేసీఆర్‌ను కలిసి అమెరికా రావాల్సిందిగా కోరినట్టు తెలిసింది. అక్కడికి వచ్చి కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరారని తెలిసింది. మనుమడు హిమాన్షు కోరిక మేరకే కేసీఆర్ అమెరికా వెళ్తారని తెలిసింది. ఈ మేరకు ఈ నెల, లేదా వచ్చే నెలలో కేసీఆర్ అమెరికా షెడ్యూల్ ఉండొచ్చని భావిస్తున్నారు.

