nagarjuna

Nagarjuna : కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు?

 

తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖకు నటుడు అక్కినేని నాగార్జున నోటీసులు పంపుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైజాగ్‌లో ఉన్నారని, హైదరాబాద్ రాగానే నోటీసులు పంపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎంతవరకైనా పోరాడాలని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

మరోవైపు సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను’ అని ట్విట్టర్ లో సమంతను ట్యాగ్ చేశారు.

కేటీఆర్ పై ఆరోపణలు చేసే క్రమంలో సమంత, అక్కినేని కుటుంబాలపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమవడంతోపాటు ప్రజలు, రాజకీయ పక్షాలు ఆమె తీరును ఖండించాయి. ఇప్పటికే ‘హైడ్రా’తో GHMC పరిధిలో పేదల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి సురేఖ వ్యాఖ్యలు మరింత డ్యామేజ్ కలిగించాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

నటి సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ అంశంపై ఈ మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్ అత్యవసర మీడియా సమావేశం నిర్వహించనుంది. అందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని సహా పలువురు నటీనటులు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *