Nalgonda

Nalgonda: చిరుమర్తి నాయకత్వంలో పని చేయలేకపోతున్నామని కేడర్‌ అసహనం

Nalgonda: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది గులాబీ పార్టీ…కాలాచక్రం గిర్రున తిరిగింది. 2023లో సీన్ రివర్స్ అయింది. తిరిగి కాంగ్రెస్ పన్నెండు స్థానాల్లో సూర్యాపేట మినహా అన్ని సీట్లలో బంపర్ మెజారిటీ విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలో సైతం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. ఇక గెలిచిన ఒక్కో ఎమ్మెల్యే ముప్పైవేలకిపైగా ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థుల మీద గెలిచారు. అందులో ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ నకిరేకల్ సెగ్మెంట్‌లో రికార్డ్ స్థాయిలో 68 వేలపైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వేముల వీరేశం తన ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యపై ఘన విజయం సాధించారు.ఇంతటి ఘోర పరాజయానికి మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలే కారణమంటున్నారు కింద స్థాయి నేతలు…

Nalgonda: 2018 అసెంబ్లీ ఎన్నికలో నకిరేకల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చిరుమర్తి లింగయ్య గెలిచారు.
అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కాంగ్రెస్‌ను వీడి గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇక అసలు కథ ఇక్కడే మెదలైంది. ఎవరైనా పార్టీలో చేరాక సొంత పార్టీ నేతలతో కలసి పనిచేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్…పార్టీలో చేరిన బీఆర్ఎస్ మండల, గ్రామస్థాయి నేతలతో కాకుండా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉంటూ సొంత పార్టీ వారిని పరాయి వాళ్లలా చూసేవారట మాజీ ఎమ్మెల్యే… అదేంటని ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి వేధించేవారట. పని కోసం వెళ్తే తన ఛాంబర్‌లోకి రానివ్వకుండా గంటల కొద్దీ సమయం వెయిట్ చేయించే వారాని టాక్‌ నడిచింది. కొన్నిసార్లు ముఖ్య నేతలను సైతం అందరి ముందే అవమానకరంగా మాట్లాడేవారట…అదే కాంగ్రెస్‌కు చెందిన లీడర్లు చెబితే ఇట్టే పని చేసేసే వారట.

దీంతో ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్‌ను నమ్ముకున్న వారికి తీరని అన్యాయం జరిగిందని బాహటంగానే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇప్పటికే పోలీసులు చిరుమర్తి లింగయ్యకు
నోటీసులు ఇచ్చి విచారణ సైతం చేశారు. నకిరేకల్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌తో పాటు సొంత బీఆర్ఎస్ నేతల ఫోన్ ట్యాప్ అయిందని ఆ పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారట… ఎన్నోసార్లు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సైతం గులాబీ పార్టీ నాయకులను, కేడర్‌ను అందరిని కలుపుకొని పని చేయాలని సూచించినా అప్పటి వరకు ఓకే అని పక్కకు వెళ్లాక తిరిగి సొంత పార్టీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పాడ్డారట మాజీ ఎమ్మెల్యే..

ALSO READ  DSC అభ్యర్దులకు అలర్ట్.. మరో నాలుగు రోజులే

ఇది కూడా చదవండి: Gold rate: స్థిరంగానే పసిడి..మరి వెండి ధర ఎంతంటే..?

Nalgonda: ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడినా మాజీ ఎమ్మెల్యే లింగయ్య వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదట… ఒకరిద్దరు చోటా మోటా లీడర్లను వెంట వేసుకొని పార్టీ పిలుపునిచ్చిన ప్రోగ్రామ్స్ చేస్తున్నారట… దీంతో ఒళ్లు మండిన మండల, గ్రామ స్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలు పోటీగా మరో కార్యక్రమం చేస్తున్నారట. ఇక ఈ మధ్య మండల స్థాయి లీడర్స్ ఒక అడుగు ముందుకేసి మీడియా ఎదుట బహిరంగగానే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలందరిని కలుపుకొని పోవడం వల్లే స్వల్ప మెజారిటీతో ఓడిపోయారంటూ సెటైర్ వేస్తున్నారు. లింగయ్య నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడే కానీ కేసీఆర్, జగదీశ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని తమ మనుసులో మాట బయట పెట్టారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా మాజీ ఎమ్మెల్యే వైఖరితో నకిరేకల్ నియోజకవర్గంలో దానిని ఒడిసిపట్టుకోవడంలో విఫలమౌతున్నామని తెగ మదనపడుతున్నారట కిందిస్థాయి లీడర్స్, కేడర్…

Nalgonda:ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే తన ఒంటెద్దు పోకడలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కలసి ఉంటే కలదు సుఖం అన్న చందంగా ఉంటే సరేసారి లేకపోతే మరోసారి మాజీగానే కంటిన్యూ కావాల్సి ఉంటుందనే మాట్లాడు కోవడం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్‌గా మారిందట. చూడాలి మరి రాబోయే రోజుల్లోనైనా నకిరేకల్ బీఆర్ఎస్‌లో మార్పు వస్తుందో లేదో..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *