Pushpa-2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రష్ రశ్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన, ప్రముఖ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప -2 విడుదలకు ముందే పలు సంచలనాలను నమోదు చేస్తున్నది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ తగ్గేదెలే అన్న డైలాగ్‌ను నిరూపిస్తూ దూసుకు పోతున్నది. ఇప్పటికే పాటలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. పుష్ప సినిమా పలు సంచలనాలతో అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టింది. దీంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఆ అంచనాలు తగ్గేదెలే అంటూ అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి.
డిసెంబర్ 4న బెనిఫిట్ షోతో, 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప 2 సినిమా అందరి అంచనాలను మించి పోతున్నది. బుధవారం రాత్రి నుంచి బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఈ చిత్రం 80 దేశాల్లో 6 భాషల్లో విడుదల అవుతుంది. తొలిరోజునే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు ప్రదర్శించబడుతున్నాయి. బహుషా అత్యధిక థియేటర్ల విషయంలో ఇదే తొలి ఇండియన్ చిత్రంగా రికార్డు నమోదు చేసుకునే అవకాశం ఉన్నది.
ప్రీరిలీజ్ బిజినెస్‌లో కూడా ఈ సినిమా రికార్డును నమోదు చేసింది. రూ.670 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆడియో, డిజిటల్ రైట్స్, ఓటీటీ రూపంలో మరో రూ.400 కోట్లు బిజినెస్ జరిగినట్టు సమాచారం. టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‌లో కూడా ఈ సినిమా రికార్డులను సృష్టించింది. అత్యంత వేగంగా ఒక మిలియన్ టికెట్లు అమ్ముడైన చిత్రంగా పుష్ప-2 సినిమా నిలిచింది.
బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఇది కల్కి, బాహుబలి-2, కేజీఎఫ్-2 రికార్డులను చెరిపేసిందని పేర్కొన్నాయి. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.100 కోట్ల మార్క్ క్రాస్ అయిందని, భారత సినీ చరిత్రలో ఇదే రికార్డు అవుతుందని పుష్ప-2 సినిమా టీం వెల్లడించింది.
కేవలం బుక్‌మై షోలో ఇన్ని టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో అయితే బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే ఫస్ట్ డే కలెక్షన్లు మొత్తం అమ్ముడయ్యాయి. తొలి నుంచి భారీ అంచనాలు నమోదు చేస్తూ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్నదా? లేదా? అన్న విషయాలు గంటల వ్యవధిలోనే తెలియనున్నది.

