Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురయ్యారు. రాయపోలు నుంచి ఎండ్లగూడ వెళ్లే రహదారిపై ఈ ఘటన జరిగింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నాగమణి విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం జరగ్గా, 10 నెలల క్రితం భర్తతో విడాకులయ్యాయి. అనంతరం నెల రోజుల క్రితం మరో వ్యక్తిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని ఆమె సోదరుడు పకడ్బందీగా ప్లాన్ చేసి, డ్యూటీకి వెళ్తుండగా కార్‌తో ఢీ కొట్టి, వేట కొడవలితో నరికి హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Hyderabad: ‘8 సంవత్సరాలుగా నేను నాగమణి ప్రేమించుకుంటున్నారని, ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్లు నాగమణిని పట్టించుకోవడం మానేశారని తెలిసింది.. 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంతకుముందు 4 సంవత్సరాలు తను హాస్టల్లోనే ఉంది. ఆ సమయంలో తనేఆమెకు కావాల్సిన అవసరాలు తీర్చి చదివించాను. కానిస్టేబుల్ జాబ్ వచ్చాక తల్లిదండ్రులు ఆమెకు దగ్గరయ్యారు తెలిపారు. నవంబర్ 10వ తేదీన యాదగిరిగుట్టలో మేం పెళ్లి చేసుకున్నామని, పెళ్లి చేసుకున్న వెంటనే మాకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని భర్త వివరించారు.
Hyderabad: మేం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మమ్మల్ని చంపుతామని నాగమణి కుటుంబసభ్యులు బెదిరిస్తూ వచ్చారు. ఈ రోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ల తమ్ముడు చంపేశాడని ఆరోపించారు. రాయపోల్ నుంచి హయత్‌నగర్ బయలుదేరే ముందు నాకు ఫోన్ చేసింది. మా తమ్ముడు నన్ను చంపేస్తున్నాడు అంటూ ఫోన్ కట్ చేసింది. వెంటనే మా అన్నయ్యకు విషయం చెప్పాను. ఆయన వెళ్లేలోపే రక్తపు మడుగులో నాగమణి కొట్టుకుంటుంది.’ అని నాగమణి భర్త శ్రీకాంత్ వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.