Supreme Court: మనం రోజూ సూపర్ మార్కెట్లు, కిరాణా కొట్లలో కొనే చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్, ఇన్స్టంట్ నూడుల్స్ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది! కొవ్వు (Fat), చక్కెర (Sugar), ఉప్పు (Salt) అధికంగా ఉండే అన్‌హెల్తీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్యాకెట్ల ముందు భాగంలోనే (Front-of-Pack) అందరికీ స్పష్టంగా కనిపించేలా ఎరుపు రంగు హెచ్చరిక లేబుల్స్ (Red Warning Labels) ముద్రించాలని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI)ను ఆదేశించింది.
నవంబర్ 26, 2026న జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు 131 పేజీల సంచలన తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు, ఆరోగ్య హక్కు) మరియు ఆర్టికల్ 47 ప్రకారం ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడం, తాము ఏం తింటున్నామో తెలుసుకునే సమాచార హక్కు కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. ప్రతి భోజనం మన శరీరంతో మనం వేసుకునే ఒక నిశ్శబ్దపు పందెం లాంటిది. ఆ పందెంలో రిస్క్ ఏంటో ఆటగాడికి ముందే తెలిసినప్పుడే అది న్యాయమైనది అవుతుంది. మనం ఏం తింటున్నామో తెలిసినప్పుడే సరైన ఆహారం తీసుకోవడం సాధ్యమవుతుంది అని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
కొత్త వార్నింగ్ లేబుల్స్ ఎలా ఉండబోతున్నాయి? (ముఖ్య అంశాలు)..
వేర్వేరు షట్కోణ (Hexagonal) గుర్తులు: ఒకే గుర్తులో అన్నీ కలిపి కాకుండా, కొవ్వు, చక్కెర, ఉప్పులకు వేర్వేరుగా షట్కోణ (Hexagon) ఆకారంలో ఎరుపు రంగు వార్నింగ్ లేబుల్స్ ఉండాలి. వాటిపై “HIGH FAT”, “HIGH SUGAR”, “HIGH SALT” అనే అక్షరాలతో పాటు చదువురాని వారు, పిల్లలు సైతం సులభంగా అర్థం చేసుకునేలా ఉప్పు డబ్బా, చక్కెర చెంచా, నూనె చుక్క వంటి బొమ్మలు (Pictograms) ఉండాలి.
లేబుల్ సైజు & ప్రమాణాలు: చిలీ, మెక్సికో దేశాల తరహాలో ప్యాకెట్ ముందు భాగంలో కనీసం 4 నుంచి 5 శాతం స్థలాన్ని ఈ వార్నింగ్ లేబుల్ ఆక్రమించాలి. అలాగే యాడెడ్ షుగర్/ఫ్యాట్ కాకుండా, ఆహారంలో ఉన్న మొత్తం చక్కెర (Total Sugars), సంతృప్త కొవ్వు (Saturated Fat) ఆధారంగా పరిమితులను నిర్ణయించాలి.
4 నెలల డెడ్‌లైన్ & ఏడాది గడువు: డ్రాఫ్ట్ నోటిఫికేషన్, 60 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసి 4 నెలల్లోగా తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని FSSAIకి కోర్టు గడువు విధించింది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పాత స్టాక్ మార్పు కోసం కంపెనీలకు 365 రోజుల (ఒక ఏడాది) ట్రాన్సిషన్ సమయం ఇస్తారు. అయితే నెయ్యి, వంట నూనె, ఉప్పు, చక్కెర, బెల్లం, తేనె వంటి సింగిల్-ఇంగ్రీడియంట్ ఆహార పదార్థాలకు ఈ లేబుల్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.
మల్టీనేషనల్ ఫుడ్ కంపెనీల ద్వంద్వ వైఖరిపై సుప్రీం ఆగ్రహం..
భారత్‌లో వ్యాపారం చేస్తున్న బహుళజాతి ఆహార సంస్థల (MNCs) ద్వంద్వ ప్రమాణాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిలీ, మెక్సికో, యూరప్ దేశాల్లో వార్నింగ్ లేబుల్స్ వేయడానికి, ఆహారంలో చక్కెర, కొవ్వు శాతాన్ని తగ్గించడానికి అంగీకరించే ఇవే కంపెనీలు.. భారత్‌లో మాత్రం ఆరోగ్య హెచ్చరికలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ప్రశ్నించింది.
అమెరికా లేదా బ్రిటన్ వినియోగదారుడికి లభించే ఆరోగ్య భద్రత, గౌరవం కంటే భారతీయ వినియోగదారుడు ఏమాత్రం తక్కువ కాదు అని ధర్మాసనం గట్టిగా చురకలు అంటించింది. గతంలో FSSAI ప్రతిపాదించిన ‘స్టార్ రేటింగ్’ విధానాన్ని కోర్టు తోసిపుచ్చింది. 10 వారాల తర్వాత ఈ కేసును మళ్లీ విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
