Karthika Deepam

Karthika Deepam: వందేళ్ల నిరీక్షణకు తెర.. తిరుప్పరంకుండ్రం కొండపై ‘దీపథూన్’ వద్ద వెలిగిన కార్తీక దీపం!

Karthika Deepam: తమిళనాడులోని మదురై సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఎట్టకేలకు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది! దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన కఠిన ఆదేశాల నేపథ్యంలో, శనివారం (నవంబర్ 28, 2026) సాయంత్రం సరిగ్గా 5:00 గంటలకు కొండపై ఉన్న వివాదాస్పద ‘దీపథూన్’ (Deepathoon) రాతి స్తంభంపై వందేళ్ల తర్వాత కార్తీక దీపం దేదీప్యమానంగా వెలిగింది. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా మహాదీపాన్ని వెలిగించగానే కొండ దిగువన ఉన్న వేలాది మంది భక్తులు “(వెట్రి వేల్ మురుగనుక్కు అరోహర!)” అంటూ నినాదాలతో హోరెత్తించారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు.

నిజానికి కార్తీక పౌర్ణమి రోజైన నవంబర్ 24నే దీపథూన్ వద్ద దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో శుక్రవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సీఎస్, డీజీపీ సహా 15 మందికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఆలయ పాలకమండలిని సస్పెండ్ చేసి, శనివారం సాయంత్రం ఖచ్చితంగా దీపం వెలిగించేలా పర్యవేక్షించేందుకు 13 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది.

ఈ కమిటీలో సుప్రీంకోర్టు నియమించిన రిసీవర్లు (హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు) జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్, మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ, పోలీస్ కమిషనర్, సీఆర్పీఎఫ్ (CRPF) ఐజీ మరియు ఆలయ అర్చకులు (భట్టర్లు) సభ్యులుగా ఉన్నారు. వీరి సమక్షంలోనే సాయంత్రం 5 గంటలకు దీపం వెలిగించి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేశారు.

మరోవైపు, కొండపై శాంతిభద్రతల బాధ్యతను సుప్రీంకోర్టు నేరుగా కేంద్ర బలగాలకు అప్పగించడంతో, బెంగళూరు నుంచి వచ్చిన అదనపు 400 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు కొండను, పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కొండపైకి కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించగా, కొండపై ఉన్న సికందర్ దర్గాలో ముస్లిం భక్తులు ప్రార్థనలు చేసుకోవడానికి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోర్టు ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రక్షణ కల్పించిన సీఆర్పీఎఫ్ జవాన్లపై స్థానికులు, భక్తులు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు జోక్యంతో తెరపడటంతో తిరుప్పరంకుండ్రంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *