Tragedy: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది! కుటుంబ కలహాలు లేదా మనస్తాపం కారణంగా ఓ తల్లి తన ముగ్గురు కన్నబిడ్డలను ఇంట్లోని నీటి సంపులో పడేసి, తానూ అందులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ ఘటనలో ముగ్గురు అభంశుభం తెలియని ఆడపిల్లలు నీటిలో మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా మారడంతో తొమ్మిదిరేకుల గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన కందెన చెన్నయ్య దంపతులకు ఆరేళ్ల లోపు వయసున్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. శుక్రవారం చెన్నయ్య తన పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య, ఏమైందో ఏమో కానీ తన ముగ్గురు కుమార్తెలను ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడేసి, ఆ తర్వాత తాను కూడా సంపులోకి దూకింది. కొద్దిసేపటి తర్వాత ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందగా, తల్లిని మాత్రం ప్రాణాలతో కాపాడగలిగారు.
ఫోన్ ద్వారా ఈ దారుణ విషయం తెలుసుకున్న భర్త చెన్నయ్య హుటాహుటిన ఇంటికి చేరుకుని, విగతజీవులుగా పడి ఉన్న తన ముగ్గురు బిడ్డలను చూసి గుండెలవిసేలా రోదించారు. గత నాలుగైదు రోజులుగా తమ భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు కూడా జరగలేదని, తన భార్య ఎందుకు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న కేశంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అసలు ఆ తల్లి ఈ దారుణానికి పాల్పడటానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
భర్తతో గొడవ పడి కన్న పిల్లలను సంపులో పడేసి, తానూ దూకిన తల్లి
ముగ్గురు ఆడపిల్లలు మృతి చెందగా.. ప్రాణాలతో బయటపడిన తల్లి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో హృదయ విదారక ఘటన
భర్తతో గొడవ కారణంగా మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ముగ్గురు కుమార్తెలను ఇంట్లోని నీటి సంపులో పడేసి, తానూ అందులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
— Telugu Scribe (@TeluguScribe) November 28, 2026
