Telangana Global Summit: 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (US$3 Trillion Economy) తీర్చిదిద్దాలనే భారీ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో చారిత్రక అడుగు వేస్తోంది! సీఎం ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ (CURE–PURE–RARE ఆర్థిక మండళ్ల నమూనా)లో భాగంగా, అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామికవేత్తలను, భారీ పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీ (యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్) వేదికగా మూడు రోజుల పాటు ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ అంతర్జాతీయ సదస్సు వేదికగా పారిశ్రామిక, ఐటీ, సాంకేతిక, ఉన్నత విద్యా రంగాలకు కొత్త ఊతమిచ్చే 11 నూతన పాలసీలను ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు పూర్తి చేసింది.
తయారీ, మౌలిక రంగాలకు కొత్త ఊపిరి..
రాష్ట్రంలో ఇప్పటికే బలంగా ఉన్న పరిశ్రమలను మరింత విస్తరించడంతో పాటు, ఎక్కువ మంది యువతకు స్థానికంగా ఉపాధి కల్పించే రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ పాలసీ 2.0 తో పాటు, వస్త్ర మరియు రెడీమేడ్ దుస్తుల తయారీని ప్రోత్సహించేందుకు టెక్స్టైల్స్ అండ్ అపారెల్ పాలసీ 2.0, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల రంగానికి ఫుట్‌వేర్ అండ్ లెదర్ పాలసీలను తీసుకువస్తున్నారు. అలాగే రక్షణ, విమానయాన, అంతరిక్ష రంగాల్లో తెలంగాణ అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ పాలసీ, పరిశ్రమల ఉత్పత్తుల రవాణా, గిడ్డంగులు, సరఫరా వ్యవస్థలను ఆధునీకరించేందుకు లాజిస్టిక్స్ పాలసీని ఆవిష్కరించనున్నారు.
ఐటీ, సెమీకండక్టర్లు, ఏవీజీసీ & విదేశీ యూనివర్సిటీలకు పెద్దపీట..
ప్రపంచ ఐటీ దిగ్గజాల గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు (GCCs) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా జీసీసీ పాలసీని రూపొందించారు. పెరుగుతున్న డిజిటల్, ఏఐ అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్స్ పాలసీ 2.0, ఐటీ రంగ సమగ్ర విస్తరణకు ఐసీటీ పాలసీ 2.0, అత్యాధునిక చిప్ తయారీని ఆకర్షించేందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ పాలసీని ప్రకటించనున్నారు. వీటితో పాటు, సృజనాత్మక డిజిటల్ వినోద రంగాన్ని ప్రోత్సహించే ఏవీజీసీ (AVGC) పాలసీ, ప్రపంచ ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్‌షోర్ క్యాంపస్ పాలసీని కూడా సమ్మిట్‌లో విడుదల చేయనున్నారు.
గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్న 11 నూతన పాలసీల పూర్తి జాబితా..
- ఇండస్ట్రియల్ పాలసీ 2.0
- ఫుట్‌వేర్ అండ్ లెదర్ పాలసీ
- టెక్స్టైల్స్ అండ్ అపారెల్ పాలసీ 2.0
- ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ పాలసీ
- లాజిస్టిక్స్ పాలసీ
- ఐసీటీ (ICT) పాలసీ 2.0
- గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC) పాలసీ
- డేటా సెంటర్స్ పాలసీ 2.0
- ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ పాలసీ
- యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (AVGC) పాలసీ
- ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్‌షోర్ క్యాంపస్ పాలసీ
కాగా, డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ సమ్మిట్ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోని ప్రత్యేక వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 52 సెక్టార్-స్పెసిఫిక్ సెషన్లు, 6 ఎగ్జిబిషన్ హాల్స్, 136 స్టార్టప్‌ల ప్రదర్శనలతో జరగనున్న ఈ సదస్సు ద్వారా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కొత్త శిఖరాలకు చేరనుంది.
