Today Gold Price: బంగారం కొనుగోలుదారులకు పసిడి ధరలు మరోసారి గట్టి షాక్ ఇచ్చాయి! గత రెండు రోజులుగా వరుసగా తగ్గుతూ కాస్త ఊరటనిచ్చిన బంగారం ధరలు, గురువారం (నవంబర్ 26, 2026) ఒక్కసారిగా భారీగా ఎగబాకాయి. బుధవారంతో పోలిస్తే ఒక్క రోజులోనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,610 పెరగడంతో, దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1,25,890కి చేరుకుంది. అయితే, బంగారం ధరలు చుక్కలను తాకినా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర రూ.12,589గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.1,25,890 వద్ద ట్రేడవుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.2,400 పెరిగి రూ.1,15,400కి (గ్రాము రూ.11,540) చేరుకుంది. అలాగే 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,960 పెరిగి రూ.94,420 (గ్రాము రూ.9,442) వద్ద నమోదైంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతుండగా, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,040, 22 క్యారెట్ల ధర రూ.1,15,550, 18 క్యారెట్ల ధర రూ.94,570 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక వెండి విషయానికొస్తే, నేడు దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.1,65,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బుధవారం కనిష్ఠ స్థాయిలను తాకిన తర్వాత పసిడి ధరలు కొంత స్థిరపడి తిరిగి పుంజుకోవడమే ఈ భారీ పెరుగుదలకు కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు గత రెండు రోజులుగా ధరలు తగ్గడంతో రిటైల్ మార్కెట్లో కొనుగోళ్లు పెరిగి డిమాండ్ ఏర్పడటం కూడా భారత ఎంసీఎక్స్ (MCX), రిటైల్ ధరలపై ప్రభావం చూపింది.
అయితే, డిసెంబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ తగ్గే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుత పెరుగుదల కేవలం సాంకేతిక రికవరీ మాత్రమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉన్నందున, బంగారం కొనాలనుకునే వారు మరో నెల రోజుల పాటు వేచి చూడటం మంచిదని సూచిస్తున్నారు.
