Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. శుక్రవారం (నవంబర్ 20, 2026) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇకపై భారతీయ జనతా పార్టీ (BJP) ఆట మొదలవుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ సీఎం అయ్యాకే మేము 8 ఎంపీ, 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచాం – కిషన్ రెడ్డి
-
బీజేపీ విజయాల ప్రస్తావన: “రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. ఆయన విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీనే విజయం సాధించింది. రాబోయే మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా బీజేపీ ఖాతాలోనే పడతాయి” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
-
కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై విమర్శలు: రాష్ట్రంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అక్రమ సంపాదన, దుర్మార్గపు పరిపాలనపై ఒకరి గుట్టు మరొకరు విప్పుకుంటున్నాయని, ఆ రెండు పార్టీల అవినీతి, కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు ఓటు వేసే ప్రసక్తే లేదని, కమలం వికసించడం ఖాయమని అన్నారు.
-
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అడ్రస్ ఉండదు: ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయి అడ్రస్ లేకుండా పోతుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కౌంటర్..
-
ఆర్థిక వ్యవస్థ & మేక్ ఇన్ ఇండియా: ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు భారత ఆర్థిక వృద్ధిని ప్రశంసిస్తుంటే, రాహుల్ గాంధీ మాత్రం దేశం సంక్షోభంలో ఉందంటూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, చిప్స్ తయారీ, ఆటోమొబైల్ రంగాల్లో ఎగుమతులు పెరిగాయని, అమెరికా తర్వాత అత్యధిక డేటా సెంటర్లు భారత్‌కే వస్తున్నాయని తెలిపారు. కరోనా సమయంలో 140 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందించడంతో పాటు 80 దేశాలకు ఎగుమతి చేశామని గుర్తుచేశారు.
-
100 ఎన్నికల్లో ఓడిన నేత: 100 ఎన్నికల్లో ఓడిపోయిన రాహుల్ గాంధీ ప్రధాని మోదీ దిగిపోతారంటూ డెడ్లైన్లు పెట్టడం విడ్డూరంగా ఉందని, ఆయన పెట్టే డెడ్లైన్లు ఆయన నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీకే తప్ప భారత ప్రజాస్వామ్యానికి కాదని ఎద్దేవా చేశారు.
-
విదేశీ పర్యటనలు & దేశ ప్రతిష్ఠ: 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశాన్ని అప్పుల పాలు చేశారని, మన్మోహన్ సింగ్ హయాంలో అంతర్జాతీయ గ్రూప్ ఫోటోలలో ప్రధాని చివరి వరుసలో నిలబడాల్సి వచ్చేదని విమర్శించారు. నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో జీ20, బ్రిక్స్, క్వాడ్ వేదికలపై భారత్ అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. తెలంగాణ నుంచి వెళ్తున్న డబ్బుతో విదేశాల్లో భారత వ్యతిరేక శక్తులను కూడగట్టుకుని దేశ గౌరవాన్ని కించపరిచేలా రాహుల్ గాంధీ ఈవెంట్లు నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
