Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సావిత్రి దేవి (91) శుక్రవారం (నవంబర్ 20, 2026) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్‌వాల్ జిల్లా యమకేశ్వర్ బ్లాక్‌లోని తన స్వగ్రామమైన పంచూర్ (Panchur) నివాసంలో తుదిశ్వాస విడిచారు.
శనివారం హరిద్వార్‌లో అంత్యక్రియలు..
యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవి మొదటి నుంచీ ఉత్తరాఖండ్‌లోని పంచూర్ గ్రామంలోనే సాదాసీదాగా జీవితం గడిపారు. ఇటీవల అనారోగ్య సమస్యలు ఎక్కువవడంతో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. సావిత్రి దేవి అంత్యక్రియలు శనివారం (నవంబర్ 21) హరిద్వార్లో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు, జిల్లా యంత్రాంగం కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరీ గఢ్‌వాల్ ఎస్ఎస్పీ సర్వేష్ పన్వర్ తెలిపారు.
తల్లి ప్రేమ జీవితంలో అత్యంత విలువైన సంపద.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి
సావిత్రి దేవి మృతి పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్ (X) వేదికగా సంతాప సందేశం పోస్ట్ చేశారు.
-
హృదయవిదారకమైన వార్త: “ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి పూజ్య మాతృమూర్తి సావిత్రి దేవి మరణవార్త నన్ను ఎంతో బాధించింది, ఇది అత్యంత హృదయవిదారకం. తల్లి ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులు జీవితంలో అత్యంత విలువైన సంపద. ఆమె మరణం కుటుంబానికి తీరని లోటు” అని పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.
-
కేదారనాథుడిని ప్రార్థిస్తున్నా: “దివంగత ఆత్మకు తన దివ్య పాదాల చెంత స్థానం కల్పించాలని, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని యోగి జీకి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆ బాబా కేదారనాథుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి” అంటూ ఆయన నివాళులర్పించారు. సావిత్రి దేవి మరణవార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు యోగి ఆదిత్యనాథ్‌కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
