Raja Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. సిద్దిపేట సభలో సొంత పార్టీ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలకు, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం (నవంబర్ 20, 2026) హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి మాట్లాడే భాష, వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పదవి ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు!. రాజగోపాల్ రెడ్డి ఫైర్
-
‘పండబెట్టి తొక్కుతా’ వ్యాఖ్యలపై ఆవేదన: కొడంగల్‌కు వేల కోట్ల రూపాయల నిధుల కేటాయింపుపై ప్రశ్నిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ‘పండబెట్టి తొక్కుతా’ అంటూ వ్యాఖ్యానించడం తనకు ఎంతో బాధ కలిగించిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి అలా మాట్లాడటం సరికాదని తాను నిన్ననే ఖండించానని గుర్తుచేశారు.
-
అహంకారాన్ని పక్కనపెట్టి పాలించండి: “పదవిలో ఉన్నాం కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు. నిజాయితీగా, వినయంగా, ధర్మబద్ధంగా ప్రజల సొమ్మును ఏ విధంగా ఖర్చు పెట్టాలనే విషయంపై ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి అలాంటి మంచి బుద్ధిని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను” అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గుండెపై చేయి వేసుకుని చెప్పండి.. అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నారా?
-
సొంత నియోజకవర్గాలకే వేల కోట్లా?: తెలంగాణ ప్రజల సొమ్మును ఖజానా నుంచి కేవలం సీఎం, మంత్రుల సొంత నియోజకవర్గాలకు (కొడంగల్, మధిర, హుజూర్‌నగర్) తీసుకెళ్లడం సరికాదని ఆయన మండిపడ్డారు. అభివృద్ధిలో వెనుకబడిన మునుగోడుతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
-
ఆత్మపరిశీలన చేసుకోండి: “రాష్ట్రంలో అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నారా? గుండెపై చేయి వేసుకుని సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి తన పాలనపై తానే ఆత్మపరిశీలన చేసుకోవాలి. సీఎం స్థానంలో కూర్చుని దొంగలకు, పెట్టుబడిదారులకు దోచిపెట్టకూడదు” అని ఘాటుగా విమర్శించారు. వ్యక్తిగతంగా సీఎంను ఎన్నోసార్లు కలిసి విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడం వల్లే, తన నియోజకవర్గ ప్రజల కోసం బహిరంగంగా మాట్లాడాల్సి వస్తోందని స్పష్టం చేశారు.
అసలు వివాదానికి కారణమేంటి? – సిద్దిపేట సభలో సీఎం ఏమన్నారంటే?
